
ఇష్టంతో చదివితే.. విజయం తథ్యం
కొరుక్కుపేట: విద్యార్థులు ఇష్టపడి చదవితే విజయం సాధించడం ఖాయం అని ఎస్‌కేపీడీ పాఠశాల పూర్వ విద్యార్థి, ఊరా గ్రూప్ ఛైర్మన్ ఊరా లక్ష్మీ నరసింహరావు అన్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అండ్ ఛారిటీస్ నిర్వహణలోని ఎస్‌కేపీడీ బాలుర ప్రాథమిక, ఉన్నత పాఠశాల 108వ వార్షికోత్సవం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ ఎల్ సూదర్శనం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వూరా లక్ష్మీ నరసింహరావు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తాను ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థినని, తాను చదువుకున్న విధానం, ఉపాధ్యాయుల బోధన తదితర పలు అంశాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. విద్య అనేది ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం దానిని ఇష్టంతో చదివితే జీవితంలో విజయం సాధిస్తారని హితవుపలికారు. సంగీతంపై తనకు ఉన్న ఆసక్తితో విశ్వ కళా సంగమ అనే సంస్థను స్థాపించి తద్వారా కళాసేవ చేస్తున్నట్లు తెలిపారు. నార్త్ చైన్నె డీఈవో ఎలిల్ అరసి ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు ఈ రమేష్ , ఓ. లీలారాణి వార్షిక నివేదిక సమర్పించారు. అనంతరం అతిథులతో కలసి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రోలింగ్ షీల్డ్ లు, బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.