
ప్రతి నాయకుడి పాత్రలంటే ఇష్టం
తమిళసినిమా: ప్రయత్న లోపం లేకుండా ప్రేమించిన వారిని సినిమా అక్కున చేర్చుకుంటుంది. అలా నిరంతర ప్రయత్నంతో నటుడయ్యారు శర్వా. ఈయన బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటుడు. న్యాయవాదిగా పట్టభద్రుడైన శర్వాకు నటనపై చిన్నతనం నుంచి ఎంతో ఆసక్తి. దీంతో ఒక పక్క చదువుకుంటూనే స్టేజీ నటుడిగా రాటు దేలారు. పలు స్టేజీ నాటకాలు ఆడిన ఈయన రెండు సీరియళ్లలోనూ నటించారు. అలా తాజాగా శర్వా ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ హార్ట్ బీట్. రెండు సీజన్స్, 200 ఎపిసోడ్స్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్‌లో గుణ అనే పాత్రలో నటించిన శర్వా బాగా పాపులర్ అయ్యారు. ఈ వెబ్ సిరీస్ నాలుగైదు చిత్రాల్లో నటించినంత అనుభవాన్నిచ్చిందని శర్వా పేర్కొన్నారు. బయటకు వెళ్లితే అందరూ తనను గుణ అనే పిలుస్తున్నారనీ, అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. అదే విధంగా ఆర్‌కే నగర్, తమిళ్ రాకర్స్ సిరీసుల్లోనూ నటించిన శర్వా ఇప్పుడు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. నటుడు అధర్వ హీరోగా నటించిన దణల్ చిత్రంలో పోలీస్ అధికారిగా ముఖ్య పాత్రను పోషించారు. ఇది ఈ నెల 12వ తేదీన తెరపైకి రానుంది. అనేక ప్రయత్నాల ఫలితంగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాననీ, తనదైన ప్రతిభతో మరిన్ని అవకాశాలను పొంది ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పిన శర్వా ప్రతినాయకుడి పాత్రల్లో నటించడం ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలు అయితేనే నటనలో పలు పరిణామాలు చూపించగలమని అన్నారు. హార్ట్‌బీట్ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాననీ, అందువల్ల తెలుగు తదితర భాషల్లోనూ అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని శర్వా పేర్కొన్నారు.