
జననాయగన్ లోడింగ్
విజయ్‌తో
నటి పూజాహెగ్డే
తమిళసినిమా: కొన్ని చిత్రాలకు ప్రచారం అవసరమే ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల గురించి నిత్యం ఏదో వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. ఆ చిత్రాల అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు కాబట్టి వద్దంటే ప్రచారం చేస్తుంటారు. అలాంటి స్టార్ హీరోలలో నటుడు విజయ్ ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం జననాయగన్. ఇదే ఈయన నటించే చివరి చిత్రం కావడంతో దీనికి సంబంధించిన చిన్న విషయం అయినా ప్రచారం మాత్రం భారీగా ఉంటుంది. విజయ్ సరసన నటి పూజాహెగ్డే నటిస్తున్న ఇందులో నటి మమితాబైజూ, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన తెరపైకి రానుందన్న ఒక అధికారిక ప్రకటన మినహా మరో విషయం ఇప్పటి వరకూ వెలువడలేదు. తాజాగా జననాయగన్ చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌తో కూడిన వీడియోను దర్శకుడు హెచ్.వినోద్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. అందులో దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. సాధారణంగా హీరో, హీరోయిన్, దర్శకుల పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ల ప్రకటనలను విడుదల చేస్తుంటారు. అయితే జననాయగన్ చిత్ర యూనిట్ మాత్రం వీడియోతో సరి పెట్టుకుంది. అయినప్పటికీ జననాయగన్ లోడింగ్ అంటూ నెటిజన్లు ప్రచారం జేస్తుండడం విశేషం. ఇది పక్కా మాస్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సమాచారం.

జననాయగన్ లోడింగ్