
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి కోర్టులో చుక్కెదురు
తమిళసినిమా: సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను ఇతరులెవరైనా తమ చిత్రాల్లో ఆయన అనుమతి లేకుండా ఉపయేగిస్తే కచ్చితంగా నష్ట పరిహారం కోరుతూ కోర్టుకెక్కుతారు. అలా తాజాగా ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంపై కోర్టుకెక్కారు. నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇందులో సంగీత దర్శకుడు ఇళయరాజా తన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళమై ఇదో ఇదో, ఒత్త రూపాయి దానే, ఎన్ జోడి మంజ కురువి అనే పల్లవులతో సాగే పాటలను ఆయన అనుమతి లేకుండా ఉపయోగించారు. దీంతో ఇళయరాజా తన అనుమతి పొందకుండా తన పాటలను ఉపయోగించడాన్ని ఖండిస్తూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో రూ.5 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన చిత్ర నిర్మాతల వర్గం ఆ పాటలకు ఎవరి వద్ద అనుమతి పొందాలో వారి నుంచి అనుమతి పొందినట్లు, ఇళయరాజా ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఇళయరాజా పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఇళయరాజా పాటలను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఈ కేసుపై చిత్ర నిర్మాతలు బదులు పిటీషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రెండు వారాల తరువాత తదుపరి విచారణను జరుపనున్నట్లు పేర్కొంది.