
మేకల సంతకు పోటెత్తిన గ్రామీణులు
పళ్లిపట్టు: పొదటూరుపేట పరిసర ప్రాంతాల్లో జాతర పురస్కరించుకుని నిర్వహించిన మేకల సంతలో రూ.పది లక్షలకు పైగా మేకల వ్యాపారం నిర్వహించారు. పొదటూరుపేట, పాండ్రవేడు, కేశవరాజుకుప్పం, గొళ్లాలకుప్పం, పుణ్యం, జంగాలపల్లె, కాకళూరు, చవటూరు సహా 20కు పైబడిన గ్రామాల్లో మంగళవారం జాతర వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పొదటూరుపేటలో సోమవారం మేకల సంత నిర్వహించారు. ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా తదితర ప్రాంతాల నుంచి మేకల కాపరులు, వ్యాపారులు వాహనాల్లో సంతకు మేకలు తీసుకొచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు మేకల సంత నిర్వహించారు. మేకలు ధరలు అధికంగా పలికినా గ్రామీణులు వెనుకాడకుండా కొనుగోలు చేశారు. మేకల ధరలు పెరగడంపై గ్రామీణులు మాట్లాడుతూ.. జాతర వేడుకల్లో అమ్మవారికి మేకలు బలిదానం చేయాలని మొక్కుల మేరకు చాలా మంది మేకలు కొనేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయించారు. పది కేజీల మేక రూ.12 వేలకు విక్రయించారు. మాంసం దుకాణాల్లో కేజీ మటన్ రూ.700 నుంచి 800 వరకు విక్రయిస్తున్న క్రమంలో మేకల సంతలో భిన్నంగా ధరలు పెంచి విక్రయించారు. అయినా అమ్మవారికి మెక్కులు చెల్లించాలనే కోరిక మేరకు ధరలు ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు పది లక్షల రూపాయలకు పైబడిన వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు తెలిపారు.