
డీఎంకే వైపు యువత చూపు
తిరుత్తణి: యువకులు పెద్ద సంఖ్యలో డీఎంకేలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎమ్మెల్యే చంద్రన్ తెలిపారు. తిరుత్తణి నార్త్ మండల డీఎంకే కార్యదర్శి విజయకుమార్ ఆధ్వర్యంలో తిరువలంగాడు మండలానికి చెందిన అన్నాడీఎంకే, పీఎంకే, టీవీకే, ఎన్‌ఎంకే పార్టీలకు చెందిన 50 మంది యువకులు డీఎంకేలో చేరే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎన్‌ఎన్ కండ్రిగలోని డీఎంకే మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరువళ్లూరు జిల్లా డీఎంకే కార్యదర్శి, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు. డీఎంకేలో చేరేందుకు ముందుకొచ్చిన యువకులకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వ విధానాలతో యువకులు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్తు యువతదేనని, కష్టపడి పనిచేసే వారికి డీఎంకేలో గుర్తింపు ఉంటుందన్నారు. కుల మతాలకు డీఎంకే అతీతమని, పార్టీ సిద్ధాంతాలతో కష్టపడి చిత్తశుద్ధితో పని చేస్తే తగిన గుర్తింపు వస్తుందని తెలిపారు.