
రెండు బైకులు ఢీకొని ఇద్దరి మృతి
తిరుత్తణి: బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. తిరుత్తణి సమీపంలోని మంగాపురం గ్రామానికి చెందిన ఆకాష్(27) ప్రయివేటు కంపెనీలో పనిచేసేవాడు. సోమవారం ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని తడుకుపేటకు చెందిన సమీప బంధువు దినేష్(27) మంగాపురానికి వచ్చి సాయంత్రం బైకులో ఆకాష్‌ను తీసుకుని మద్దూరు గేటు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా బైకులో వచ్చిన మద్దూరుకు చెందిన గోవిందరాజ్(28) అనే వ్యక్తి బైకు దినేష్ నడిపిన బైకు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో దినేష్, గోవిందరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైకులో వెళ్లిన ఆకాష్‌కు తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో నడిచి వెళ్లిన తడుకుపేటకు చెందిన మునిరత్నం(60) అనే వ్యక్తికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. రక్త గాయాలతో పోరాడుతున్న ఇద్దరిని అక్కడున్న వారు కాపాడి 108 ఆంబులెన్స్ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం చైన్నెలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలం చేరుకున్న తిరుత్తణి పోలీసులు రోడ్డులో పడివున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.