
త్వరలో ఐసీయూలోకి అన్నాడీఎంకే
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే త్వరలో ఐసీయూలోకి చేరి చికిత్స పొందబోతున్నట్టు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఆరోగ్యశాఖ నేతృత్వంలో సైదా పేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆస్పత్రిని సోమవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిని సందర్శించారు. ఇక్కడున్న వసతులు, వైద్యపరంగా చికిత్సలపై ఆరా తీశారు. 120 పడకలతో ఇక్కడ బ్రహ్మాండమైన ఆస్పత్రిని నిర్మించిన ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్‌కు మరోసారి అభినందనలని వ్యాఖ్యలు చేశారు. సైదాపేట ప్రజలకు మాత్రమే కాకుండా పరిసరవాసులకు ఈ ఆస్పత్రి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి రెండు కళ్లు అని గుర్తు చేశారు. అందుకే ఈ రెండింటికి ప్రత్యేక ప్రాధాన్యతను సీఎం స్టాలిన్ ఇస్తూ వస్తున్నారని వివరించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తమిళనాడు దూసుకెళ్తోందని పేర్కొంటూ, వివిధ వైద్య పథకాలను గుర్తుచేశారు. చైన్నె నగరం భారతదేశ వైద్య రాజధానిగా మారిందన్నారు. సైదాపేటకు పొరుగున ఉన్న గిండిలో కలైంజ్ఞర్ శత జయంతి స్మారకంగా రూ.240 కోట్లతో బ్రహ్మాండ ఆస్పత్రిగా రూపుదిద్దుకుని ఉన్నట్టు తెలిపారు. ఇది దక్షిణ తమిళనాడు పరిధిలోని ప్రాంతాలన్నింటికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిందన్నారు. వైద్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి వివిధ అవార్డులు, ప్రశంసలు దరి చేరుతున్నాయన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తమిళనాడు నేడు భారతదేశానికే నాయకత్వం వహిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.
ఎప్పటికీ నెంబర్‌వన్
తమిళనాడు ఎప్పటికీ నంబర్‌వన్ అని నిరూపించే విధంగా తమ ప్రయాణం సాగుతోందన్నారు. తాను ప్రభుత్వ కార్యక్రమాలలో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడనని తెలిపారు. అయితే ఇక్కడ ఒక్కవిషయం చెప్పదలచుకున్నట్టు వ్యాఖ్యలు చేశారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వని వ్యక్తి తాజాగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిని ఉద్దేశించి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడికి తాను ఒక్కటే చెబుతున్నానని, త్వరలో అదే అంబులెన్స్‌లో ప్రయాణించే పరిస్థితి వస్తుందన్నది గుర్తెరగాలని హితవు పలికారు. త్వరలో అన్నాడీఎంకే ఐసీయూలో చేరడం ఖాయమని, అప్పుడు తాము అందించే చికిత్స ఎలా ఉంటుందో గుర్తెరుగుతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాధి రహిత సమాజాన్ని సృష్టించేందుకు ఆసుపత్రిని ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎం.సుబ్రమణియన్, కె.ఎన్.నెహ్రూ, ఎమ్మెల్యేలు తాయకం కవి, ఎస్.అరవింద్ రమేష్, కె.గణపతి, ఎ.ఎం.వి.ప్రభాకరరాజా, మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎం.మహేష్‌కుమార్, జోనల్ కమిటీ నాయకులు ఎం.కృష్ణమూర్తి, ఆర్.దురైరాజ్, నోలంబూర్ వి.రాజన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ పి.సెంథిల్‌కుమార్, జాతీయ ఆరోగ్య కమిషన్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ తంబురాజ్, తమిళనాడు హెల్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వినీత్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఐసీయూలోకి అన్నాడీఎంకే