
ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు
కొరుక్కుపేట: తమిళనాడుతో సహా ఆరు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తమిళనాడుతో సహా చెంగల్పట్టులో అరెస్టయిన యువకులతో సంబంధం ఉన్నవారిని పట్టుకోవడానికి తూత్తుకుడిలో తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి తరువాత ఎన్‌ఐఏ హై అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైన్నెలోని ఒక మిల్లుపై ఉగ్రవాదుల దాడి జరిగింది. దీంతో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారిని పట్టుకోవడానికి దాడులు జరిగాయి. ఆ సమయంలో చెంగల్పట్టులో ఉంటున్న బిహార్ యువకుడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలని యోచిస్తున్నట్టు కేంద్ర నిఘా సంస్థ తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. దీని తర్వాత చెంగల్పట్టులో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో, పోలీసులు అగల్దూర్ మహ్మద్ అనే యువకుడిని(ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాడు) అరెస్టు చేశారు. అతను బిహార్ రాష్ట్రానికి చెందినవాడు. అతను ఐటీఐ పూర్తి చేసి చెంగల్పట్టులో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు పెయింటర్‌గా పని చేస్తున్నాడని తెలింది. దీంతో పోలీసులు అతన్ని విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. బిహార్‌లోని 8 చోట్ల, ఉత్తరప్రదేశ్‌లోని 3 చోట్ల, కర్ణాటక, మహారాష్ట్రలోని ఒక్కొక్క చోట సోదాలు జరిగాయి. మొత్తం 6 రాష్ట్రాల్లోని 22 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.
పాకశాస్త్ర కళాకారులకు
కలైమామణి అవార్డులివ్వాలి
సాక్షి, చైన్నె: పాకశాస్త్రం కూడా ఒక కళేనని, ప్రతీ ఏడాది కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కలైమామణి అవార్డులను తమకు కూడా ఇవ్వాలని సౌత్ ఇండియా చెఫ్స్ అసోసియేషన్ (సికా) అధ్యక్షుడు, పద్మశ్రీ గ్రహీత చెఫ్ దాము విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 7వ ఎడిషన్ సికా కలినరీ ఒలింపియాడ్–2025 పోటీల ట్రోఫీలు, బ్రోచర్‌లను సోమవారం ఆవిష్కరించారు. ఇందులో పాల్గొన్న చెఫ్ దాముతోపాటు జనరల్ సెక్రటరీ చెఫ్ సీతారామ్ ప్రసాద్ మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సికా కలినరీ ఒలింపియాడ్‌కు దక్షిణ భారత సికా చాప్టర్లలో 3000 మందికి పైగా చెఫ్‌లు, 4 అంతర్జాతీయ జట్లు పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ నెల 19 నుండి 21 వరకు చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా జరుగుతాయనిని అన్నారు. పాకశాస్త్రం కూడా ఒక కళ అని అందువల్ల కళాకారులకు అందించే కలైమామణి అవార్డును తమకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. చెఫ్‌లు అజిత్ జనార్దనన్, కాశీ విశ్వనాథన్, సుధాకర్ ఎన్.రావు, తిరులోగచందర్, మోహన కృష్ణన్, రాజేష్ రాధాక్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
హరిద్వార్‌కు సెంగోట్టయన్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలోని పదవుల నుంచి తనను తప్పించడంతో మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రపై సెంగోట్టయన్ దృష్టి పెట్టారు. కోయంబత్తూరు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తాను ఢిల్లీలో ఎవర్నీ కలవబోనని, తాను హరిద్వార్‌కు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. బహిష్కృతులు, బయటకు వెళ్లిన వారందర్నీ కలుపుకుని సమష్టిగా, సమన్వయంతో 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొందామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి ఆ పార్టీ సీనియర్ నేత సెంగోట్టయన్ సూచించడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన్ను పార్టీ పదవుల నుంచి పళణిస్వామి తప్పించారు. ఆయన మద్దతుదారులపై సైతం వేటు వేస్తూ వస్తున్నారు. కింది స్థాయిలో ఉన్న సెంగోట్టయన్ మద్దతుదారులు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. అదే సమయంలో అసంతృప్తితో అన్నాడీఎంకేలో ఉన్న నేతలందర్నీ ఏకం చేయబోతున్నట్టు సెంగోట్టయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిస్థితులలో సోమవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయల్దేరనున్న సమాచారంతో రాజకీయంగా చర్చ ఊపందుకుంది. ఢిల్లీలో ఆయన బీజేపీ నేతలను కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ చర్చకు ముగింపు పలికే విధంగా సెంగోట్టయన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. మానసిక ప్రశాంతత కోసం హరిద్వార్ యాత్రకు ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు. అయితే తాను ఢిల్లీలో ఎవర్నీ కలవబోనని, ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం, సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి తనకు లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నానని, కేడర్ అభిప్రాయాలను తాను మనస్సు విప్పి మాట్లాడితే, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడండి అని అసహనం వ్యక్తం చేశారు. తాను మరే ఇతర వ్యాఖ్యలు చేయబోనని, తాను ఆధ్యాత్మిక యాత్రకు బయల్దేరుతున్నట్టు, మళ్లీ చెబుతున్నానని, అందరూ కలిసి ఉండాలన్నదే తన అభిప్రాయమని వ్యాఖ్యలు చేశారు.

ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు