
మల్‌లైసత్యకు శాశ్వత ఉద్వాసన
వైగో నిర్ణయం
15న భవిష్యత్తు కార్యాచరణ
సాక్షి, చైన్నె: ఎండీఎంకేలో మల్‌లై సత్యపై ఆ పార్టీ అధినేత వైగో వేటు వేశారు. ఆయన్ను శాశ్వతంగా పార్టీ నుంచి తొలగిస్తూ సోమవారం ప్రకటించారు. డీఎంకే నుంచి గతంలో చీలికతో ఆవిర్భవించిన పార్టీ మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) అన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా, ప్రధాన కార్యదర్శిగా వైగో వ్యవహరిస్తున్నారు. ఆయన తనయుడు దురై వైగో రాజకీయ ప్రవేశంతో పార్టీ కోసం శ్రమించిన ముఖ్య నేతలందరూ బయటకు వెళ్లిపోయారు. వైగో నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన మల్‌లై సత్య ఎన్ని అటు పోట్లు ఎదురైనా పార్టీనే నమ్ముకుని ముందుకు సాగారు. తాను వైగోకు విశ్వాసపాత్రుడ్ని అంటూ ఆయనకు సేవలు చేసుకుంటూ వచ్చారు. అయితే దురై వైగో, మల్‌లై సత్య మధ్య వివాదం రాజుకోవడంతో ఎండీఎంకేలో వివాదానికి దారి తీసింది. ఈ వివాదం నేపథ్యంలో వైగో తన నమ్మిన బంటును ద్రోహిగా వ్యాఖ్యానించారు. దీనిని మల్‌లై సత్య తీవ్రంగా పరిగణించారు. తనకు న్యాయం కావాలంటూ మల్లైసత్య ఆందోళనకు సైతం దిగారు. పార్టీలోకి వచ్చి రాగానే దురైవైగోకు ప్రిన్సిపల్ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడాన్ని అనేక మంది వ్యతిరేకిస్తూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మల్‌లై సత్య వెన్నంటి నిలుస్తూ రావడంతో ఎండీఎంకేలో చీలిక తప్పదన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో గత నెల మల్‌లై సత్యను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ వైగో నిర్ణయం తీసుకున్నారు. వివరణ కోరుతూ ఆయనకు నోటీసులు పంపించారు. అయితే మల్‌లై సత్య స్పందించలేదు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం వైగో నిర్ణయం తీసుకున్నారు. తనను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపుతారని ముందే గ్రహించినట్టు, తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై మద్దతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఈ నెల 15న కీలక నిర్ణయం ప్రకటిస్తానని మల్‌లై సత్య స్పష్టం చేశారు.