
నేత్రదానంపై మానవహారం
సాక్షి, చైన్నె: నేత్ర దాన పక్షోత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ అగర్వాల్స్ ఐ ఆస్పత్రి నేతృత్వంలో నేత్రదానాన్ని ప్రోత్సహించే విధంగా మానవహారాన్ని సోమవారం చైన్నెలో నిర్వహించారు. ప్రతి ఏడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చైన్నెలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ ఆస్పత్రి క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ ఎస్.సుందరి నేతృత్వంలో టీటీకే రోడ్డులోని ఆస్పత్రి నుంచి మానవహారం చేపట్టారు. ఇందులో డాక్టర్ అగర్వాల్స్ ఐ ఇనిస్టిట్యూట్ నుంచి ఆప్టో మెట్రిక్ విద్యార్థులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ప్లకార్డులను చేతబట్టి నేత్ర దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్ర దానం హెల్ప్ లైన్ నెంబర్ 94444 44844 ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ సుందరి మాట్లాడుతూ చాలా మంది యువకులు నేత్ర దానం ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా యువత నేత్ర దానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోనే రెండో అతి పెద్ద ఐ బ్యాంక్ తమ ఆస్పత్రిలో ఉన్నట్టు, నేత్ర దానం కోసం నమోదు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా తమ బ్యాంక్‌కు 2500 కంటే ఎక్కువ కార్నియా మార్పిడి అభ్యర్థనలు వస్తున్నాయని, ఇలాంటి వారికి నేత్ర దానం దోహదకారిగా ఉంటుందన్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకు 2,255 నేత్రాలను సేకరించామని, మార్పిడి కోసం ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.