
సీఎం అభ్యర్థిగా పళణి పేరు ప్రకటించ లేదు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె.పళణి స్వామిని కూటమి సీఎం అభ్యర్థిగా తాను ప్రకటించ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ఇది కాస్తా అన్నాడీఎంకే వర్గాల్ని విస్మయంలో పడేసింది. ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగుతూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా సోమవారం తిరునల్వేలిలో నైనార్ నాగేంద్రన్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అధికార మార్పు అవశ్యమని, రాష్ట్రాన్ని పట్టిన డీఎంకే అనే గ్రహణం త్వరలో వీడబోతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతో బీజేపీ తీవ్రంగా పోరాడుతున్నట్టు వివరించారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం రాష్ట్రంలో అన్నాడీఎంకే అని, అందుకే అన్నాడీఎంకేతో కలసి ఎన్‌డీఏ కూటమి ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కూటమి అయినా, తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి బలాన్ని పెంపొందించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. అయితే దినకరన్ తనపై ఆధార రహిత ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినానంతరం అందరితో కలసి ముందుకెళ్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఒక సారి దినకరన్ గతాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. ఈ సారి అధికారంలోకి తప్పని సరిగా రావాల్సిన అవశ్యం కూటమికి ఉందన్నారు. అయితే పళణిస్వామిని కూటమి సీఎం అభ్యర్థిగా తాను ఎన్నడూ ప్రకటించ లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. కూటమి సీఎం అభ్యర్థి పళణిస్వామి అని ఆది నుంచి అన్నాడీఎంకే వర్గాలు స్పష్టం చేస్తుంటే, తాజాగా మళ్లీ సీఎం అభ్యర్థి వ్యవహారంలో బీజేపీ నేతల డొంక తిరుగుడు వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి.