
ఉత్తమ న్యూస్‌రీడర్లకు అవార్డులు
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం నేతృత్వంలో ప్రప్రథమంగా న్యూస్ రీడర్లకు ఉత్తమ అవార్డులను సోమవారం ప్రదానం చేశారు. తమిళాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి స్వామినాథన్ ఈ అవార్డులను అందజేశారు. మీడియాలో వార్తలను కచ్చితంగా, అనర్గళంగా వ్యక్తీకరించే న్యూస్ రీడర్లు, ప్రత్యేక ఇంటర్వ్యూలతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించే వ్యాఖ్యాతలను సత్కరించే విధంగా ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయడానికి ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి అవార్డుతోపాటుగా రూ.25 వేలు నగదు బహుమతిని అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. 2023–24 సంవత్సరానికి ఎంపికై న అర్హులైన న్యూస్ రీడర్లు, వ్యాఖ్యాతలను సత్కరించి, అవార్డులను ప్రదానం చేస్తూ మంత్రి స్వామినాథన్ చర్యలు తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో డాక్టర్ వి.కె.సర్వోదయ రామలింగం, వేదవల్లి జగదీశన్, అరుణోదయ స్వర్ణ మేరి, పి.మోహన్‌రాజ్‌లను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ కార్యదర్శి వి.రాజారామన్, తమిళ అభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుల్ తదితరులు పాల్గొన్నారు.