
● 3 అంశాలతోనే పెట్టుబడుల వరద ● మరపురాని జ్ఞాపకాలతో తమిళ
సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్ గత నెల విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జర్మనీ, ఇంగ్లాండ్‌లో ఆయన పర్యటన ఆదివారం వరకు సాగింది. ఈ పర్యటన ద్వారా తమిళనాడులోకి రూ.15,516 కోట్ల పెట్టుబడులు తమిళనాడులోకి వచ్చాయి. తద్వారా 17,613 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. లండన్‌లో విదేశీ పర్యటనను ఆదివారం సీఎం ముగించారు. చివరగా ఇంగ్లాండ్‌లోని ప్రవాస తమిళుల నేతృత్వంలో తమిళ కల పేరిట జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌తో పాటూ మంత్రి టీఆర్‌పీ రాజా, ప్రవాస తమిళ సంక్షేమ బోర్డు చైర్మన్ కార్తికేయ, ఓవర్సీస్ తమిళ్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రముఖులుబ్రదర్ రామ్, పీ గాంధీ, సోదరుడు ముహమ్మద్ ఫైసల్, సెంథిల్ సహా నిర్వాహకులు, సీఎం సతీమణి దుర్గా స్టాలిన్ హాజరయ్యారు.
తమిళ భాషా చిహ్నం..
ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ఓ యువత చిత్రమా! ఓ స్ఫూర్తిదాయకమైన ఇతిహాసమా! ఓ జలధార పుష్పమా! అన్న కవితతో ప్రసంగాన్ని అందుకున్నారు. తమిళులుగా జన్మించడం ఒక వరంగా పేర్కొంటూ, తమిళ భాషకు చిహ్నంగా ప్రపంచ వ్యాప్తంగా నలమూలలలో ఎక్కడో ఒక చోట తమిళుడు ఉన్నాడని వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌తో సహా వివిధ యూరోపియన్ దేశాలలో ఉన్న తమిళులందర్నీ చూస్తుంటే, ఎంతో ఆనందం కలుగుతున్నట్టు వివరించారు. ఈ పర్యటనలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్ చిత్ర పటాన్ని ఆవిష్కరించడం గురించి ప్రస్తావిస్తూ, ఈ వేడుకకు వచ్చిన వారంరూ తమను తాము పరిచయం చేసుకుంటూ తమిళనాడులోని వివిధ పట్టాణాలు, నగరాల పేర్లను ప్రస్తావించారని పేర్కొన్నారు. మాతృ రాష్ట్రాన్ని వీడి ఇక్కడకు వచ్చి ఉన్నత స్థితికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ అన్నది తప్పనిసరిగా ఉంటుందని ప్రస్తావిస్తూ, ప్రతిష్టాత్మక ఈ దేశంలో అందరూ ఆత్మగౌరవంతో ముందడుగు వేయాలని పిలుపు నిచ్చారు.తమిళులు ఉన్నత విద్యావంతులు, కష్టపడి పనిచేసేవారు అని పేర్కొంటూ, ఈ దేశంలో ఉన్న తమిళులందరూ వీటిని నిరూపించారని , ఇక్కడున్న అందర్నీ కలిసేందుకు తానకు భాగ్యం దక్కడం మరింత ఆనందంగా ఉందన్నారు.
వదులుకోవద్దు..
తమిళులు ఎక్కడికి వెళ్లినా, మాతృ భాష, సంస్కృతిని వదులుకోవద్దని, అలాగే, ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం అన్న సూత్రాన్ని మరచి పోవద్దు అని సూచించారు. కొంత కాలంగా ఇంగ్లాండ్‌లో తమిళుల ఉనికి అన్నది పెరుగుతున్నట్టు వివరిస్తూ, ఇది తమిళులందరికీ గర్వకారణంగా పేర్కొన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన యువత, ప్రశాంత వాతావరణం రూపంలో తమిళనాడులోకి పెట్టుబడులల వరద పారుతోందన్నారు. ఇది తమిళనాడు గర్వకారణమైన చిహ్నం అని, రాయబారులుగా ఇక్కడకు వచ్చినప్రతి ఒక్కర్ని చూస్తుంటే, తమిళనాడు సమగ్రాభివృద్ధికి మీరే బాధ్యత అని వ్యాఖ్యానించారు. విదేశాలలో ఉన్న పిల్లలకు తమిళ పేర్లు ఉండడం మరింత ఆనందాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొంటూ, తమిళ చైతన్యాన్ని నింపుతున్నందుకు అభినందనలు అని కొనియాడారు. వాస్తవానికి ఇక్కడున్న ప్రతి వ్యక్తితో విడివిడిగా మాట్లాడాలని ఉందని, ఇళ్లకు వచ్చి వెళ్లాలని ఉందని, తగినంత సమయం లేని కారణంగా అందర్నీ ఒకే చోట కలవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. తమిళులు ఉన్నంతంగా ఉండాలని, తోటి తమిళులకు సహకారంగా ఉండాలని సూచించారు. తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడి పారిశ్రామిక వేత్తలైన తమిళులు ముందుడుగు వేయాలని పిలుపు నిచ్చారు. తమిళుల చరిత్ర, సంస్కృతిని నేటి యువతరం మరవ కూడదని, తమిళనాడులోని కీలడి, గంగై కొండ చోళపురం మ్యూజియంలను సందర్శించి తమిళ వైభవాన్ని వీక్షించాలని కోరారు.
ఐక్యతతో ఉందాం..
తమిళులు అందరూ ఐక్యత ఉండాలని, ప్రగతి పథంలో ప్రయాణించాలని పేర్కొంటూ, ఇందుకు తోడ్పాటుగా ద్రావిడ మోడల్ పాలన ఉందని సూచించారు. ప్రవాస తమిళుల శ్రేయస్సు కోసం తాము అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని వివరిస్తూ, జనవరి12 చైన్నె వేదికగా ప్రతి ఏటా జరిగే ప్రవాస తమిళ దినోత్సవ వేడుకలలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. విజయం అన్నది తమిళులు ఉనికిలోనే ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమిళులు ప్రపంచానికి చెందినవారు అని, ప్రతి నగరంలో ఏదో ఒక చోట తమిళుడు ఉంటాడని, కులం, మతం, ధనిక, పేద అనే తేడాలు లేకుండా ఆప్యాయతను చాటుతుంటాడని వివరించారు. విదేశీ పర్యటనను ముగించుకుని చైన్నెకు సీఎం స్టాలిన్ బయలుదేరారు. సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు చైన్నెకు సీఎం చేరుకోనున్నారు. ఆయనకు బ్రహ్మారథం పట్టే విధంగా ఆహ్వానం పలికేందుకు మంత్రి అన్బరసన్ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి సీఎం నివాసం వరకు మార్గాలన్నీ డీఎంకే జెండాలతో నింపేశారు. సీఎంను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున కేడర్ తరలి వచ్చి రోడ్డుకు ఇరువైపులా నిలబడి సీఎంను ఆహ్వానించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

● 3 అంశాలతోనే పెట్టుబడుల వరద ● మరపురాని జ్ఞాపకాలతో తమిళ