
న్యూస్‌రీల్
అప్రమత్తం కాకుంటే
పెను నష్టం
సాక్షి, చైన్నె: అప్రమత్తం కాకుంటే పెనునష్టం తప్పదని అన్నాడీఎంకే వర్గాలను అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోమారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయన వల్లే తాము ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు. పళణిస్వామి తన భుజాన నైనార్ మోస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా అయితే, అందరూ ఐక్యంగా ఉండాలని, సమన్వయంగా పనిచేయాలని సూచిస్తే, నైనార్ భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పళణిస్వామిని కూటమి సీఎం అభ్యర్థిగా తాము అంగీకరించే ప్రసక్తే లేదని, అందుకే ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంను పళణి స్వామి చిద్రం చేశారని, పార్టీ వర్గాలు ఇకనైనా మేల్కొననని పక్షంలో రాజకీయంగా ముఖ్యనేతలకు నష్టాలు తప్పదని హెచ్చరించారు. పార్టీకి పెనునష్టం పొంచి ఉందని, పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై, కేడర్‌పై ఉందన్నారు.
ఆలయాల మూత
సాక్షి, చైన్నె: సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలను మూసి వేశారు. ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి 2.30 గంటల వరకు చంద్రగ్రహణం అన్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని తిరుచ్చి, మదురై, తిరుచెందూరు, పళణి, తదితర ప్రాంతాలలోని శ్రీరంగం రంగనాథ స్వామి, శ్రీ విళ్లిపుత్తూరు ఆండాల్ అమ్మవారు, రామేశ్వరం రామనాథ స్వామి, సమయపురం మారియమ్మన్ , తిరుచెందూరు మురుగన్ వంటి అతిపెద్ద ఆలయాలు సాయంత్రం నుంచి మూసి వేశారు. చైన్నెలోని పార్థసారధి స్వామి, టీనగర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారు తదితర ఆలయాలను మూసి వేశారు. సోమవారం ఉదయం శుద్దీ చేసినానంతరం పూజలు ఆలయాలలో జరగనున్నాయి. యథాప్రకారం సేవలు సాగనున్నాయి. అయితే తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, తిరుత్తణి మురుగన్ ఆలయాలు మూత పడకుండా యథాప్రకారం సేవలు జరిగాయి. అలాగే ఈరోడ్ జిల్లా తిరుచెంగోడులోని అర్ధనారీశ్వర ఆలయం కూడా మూతబడలేదు. యథా ప్రకారం పూజలు జరిగాయి.
శ్మశానంలో గోతుల కలకలం
సాక్షి, చైన్నె: ఓ శ్మశానంలో ఏకంగా ఒకేసారి 20 గుంతులు మృతదేహాలను పూడ్చేందుకు గాను.. తవ్వి ఉండడం ఆదివారం కలకలం రేపింది. వివరాలు.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని ఉడుమలైలో విద్యుత్ శ్మశాన వాటిక ఉంది. దీనికి పక్కనే మృతదేహాలను ఖననం చేయడానికి మరో శ్మశానం ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రామంలో పెద్దఎత్తున ఎలాంటి మరణాలు జరగనప్పటికీ ఏకంగా ఒకే సమయంలో 20 గోతులను మృతదేహాల ఖననం నిమిత్తం తవ్వి ఉండడం ఆదివారం వెలుగు చూసింది. గ్రామంలో ఓ మహిళ మరణించగా, ఆమె మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లిన గ్రామస్తులు ఇక్కడ 20 గోతులను తవ్వి ఉండడాన్ని చూసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సైతం రంగంలోకి దిగడంతో కలకలం రేగింది. మృతదేహాలను ఖననం చేయడానికి ముందుగా సమాచారం ఇస్తే శ్మశానంలోని సిబ్బంది గుంతలను తవ్వడం సహజంగా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ముందుగానే 20 గుంతలు తవ్వి ఉండడం అనుమానాలకు దారి తీశాయి. దీంతో శ్మశానాన్ని పర్యవేక్షించి బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎవరైనా మరణిస్తే గుంతులు తవ్వేందుకు మనుషులు దొరకడం లేదని, అందుకే ముందుగానే జేసీపీ ఉపయోగించి 20 గుంతలను తవ్వి పెట్టుకున్నట్టు అతడు ఇచ్చిన సమాచారం అందర్నీ విస్మయంలో పడేసింది. అయితే ఎవరైనా మరణించిన పక్షంలో ఆయా కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారంతో అంత్యక్రియలకు ముందుగా గోతులు తవ్వడం అనాదిగా వస్తోంది. అయితే సంప్రదాయనికి విరుద్ధంగా గోతులు తవ్వి ఉండడాన్ని పొల్లాచ్చి రెవెన్యూ అధికారులు తీవ్రంగా పరిగణించి వాటిని మట్టితో మళ్లీ పూడ్చేశారు. బాబు వద్ద పోలీసులు మరింతగా విచారిస్తున్నారు.

న్యూస్‌రీల్