
రంగంలోకి శ్రీగాంధీ
సాక్షి, చైన్నె: తనయుడు అన్బుమణికి చెక్ పెట్టే వ్యూహంతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని రంగంలోకి దించేందుకు రాందాసు సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. పీఎంకేలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న వార్ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి తప్పించాల్సిందే అన్న నినాదాన్ని సీనియర్లు అందుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు సైతం అన్బుమణి నుంచి స్పందన రాకపోవడంతో ఇక ఆయన్ను పార్టీ నిర్వాహక అధ్యక్షుడి పదవి నుంచి తప్పించే వ్యూహంలో రాందాసు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని రాజకీయంగా రంగంలోకి దించేందుకు రాందాసు సిద్ధమైనట్టు పీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే పార్టీ సర్వసభ్య సమావేశంలోనూ, ఇతర సమావేశాల్లోనూ ఆమెకు రాందాసు తాజాగా ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నట్టు చెబుతున్నారు. అన్బుమణికి చెక్ పెట్టడమే లక్ష్యంగా రెండు రోజుల క్రితం ఆడుతురైలో శ్రీగాంధీ నేతృత్వంలో సమావేశానికి నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు. అయితే ఈ సమావేశాన్ని భగ్నం చేసే విధంగా అక్కడి పార్టీ నేత మూకా స్టాలిన్‌పై దాడి జరిగిందని, అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆడుతురై సమావేశాన్ని అడ్డుకోవడాన్ని రాందాసు తీవ్రంగా పరిగణించి ఉన్నారని, ఇక, పూర్తిస్థాయిలో శ్రీగాంధీ సేవలను పార్టీకి వినియోగించుకునేందుకు నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పగించేందుకు సిద్ధమైనట్టు, ఇందుకు అనుగుణంగా ఒకటి రెండు రోజులలో అధికారికంగా రాందాసు ప్రకటన ఇవ్వబోతున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. అన్బుమణికి రాజకీయంగా చెక్ పెట్టాలంటే శ్రీగాంధీ సేవలను వినియోగించుకోవాల్సిందేనని సీనియర్లు ఇచ్చిన సూచనకు అనుగుణంగా రాందాసు వ్యూహాలకు పదును పెట్టి ఉండడం మున్ముందు పీఎంకేలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.