
పీఎం మోదీ పర్యటనలకు కసరత్తు
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్రంలో డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా కేంద్రంలోని ఎన్‌డీఏ పాలకులు వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే నేతత్వంలో కూటమిని ఏర్పాటు చేసి కార్యాచరణను వేగవంతం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడుపై ప్రత్యేక దష్టి పెట్టి వరుస పర్యటనలు చేస్తూ వస్తున్నారు. పార్టీ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరం అయితే ఢిల్లీకి పిలిపించి మరీ సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాష్ట్రంలో వరుస పర్యటనలకు సన్నద్ధం అవుతున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ వరకు ప్రధాని రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయబోతున్నట్టు తెలిసింది. ఈ పర్యటనల కసరత్తులలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్టు ఓ నేత పేర్కొన్నారు. నాలుగు నగరాలలో బహిరంగ సభలకు కార్యాచరణ చేస్తున్నారు. అంతలోపు కూటమిలోకి ముఖ్యమైన పార్టీలను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదిక మీదుగా ప్రజలకు మోదీ పరిచయం చేసే వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా మోదీ సభలలో పళణిస్వామి ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మోదీ పర్యటన లోభాగంగా రోడ్‌షోలతో పాటూ బహిరంగ సభలకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు చైన్నె, కోయంబత్తూరు, మదురై, తంజావూరు నగరాలలో బహిరంగ సభకు వేదికలపై దష్టి పెట్టి ఉన్నారు. ఉత్తర తమిళనాడులోని జిల్లాలలకు వేదికగా చైన్నె, కొంగు మండలం జిల్లాలకు వేదికగా కోయంబత్తూరు, దక్షిణ తమిళనాడుకు వేదికగా మదురై, డెల్టా జిల్లాలకు వేదికంగా తంజావూరును ఎంపిక చేసిన భారీ బహిరంగ సభల నిర్వహణకు కసరత్తులు జరుగుతున్నట్టు మరో నేత పేర్కొన్నారు.