
17 నుంచి పళణి 5వ విడత ప్రచారం
సాక్షి ,చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి 5వ విడత ప్రజా చైతన్య యాత్ర ఈనెల 17 నుంచి ప్రారంభం అవుతుందని ఆ పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. తమిళనాడు, ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణి స్వామి చేపట్టిన చైతన్య యాత్రకు విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తన బలం పెరిగినట్టుగా గ్రహించిన పళణిస్వామి ప్రజలలోకి మరింతగా చొచ్చుకెళ్లే విధంగా యాత్రను వేగవంతం చేశారు. ప్రస్తుతం నాలుగో విడత ప్రచార ప్రయాణం సాగుతున్నది. ఈ పరిస్థితులలో ఈనెల 17 నుంచి ఐదో విడత ప్రచార రూట్ మ్యాప్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ యాత్ర ధర్మపురిలో మొదలు కానున్నది. పలు జిల్లాలో పర్యటించి కడలూరులో ఈనెల 26వ తేదీన ముగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా తాత్కాలిక కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు పళణి స్వామిని కలిసి పార్టీ నేత ఏకే సెల్వరాజ్ ఆదివారం ఆశీస్సులు అందుకున్నారు. అలాగే తనకు వైద్య చికిత్సలు, శస్త్ర చికిత్సలు అందించి చేతులు తెప్పించినందుకు కృతజ్ఞతగా నారాయణ స్వామి అనే యువకుడు సైతం పళణిస్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఆదివారం పళణిస్వామి దిండుగల్ జిల్లాలో ప్రజా చైతన్య యాత్రతో దూసుకెళ్లారు.