
పెన్నీ క్విక్ కుటుంబంతో భేటీ
తమిళనాడులోని తేని, మదురై, రామనాథపురం, శివగంగై, విరుదునగర్ జిలాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బ్రిటీషు హయంలో కేరళ రాష్ట్రం ఇడిక్కిలో ముల్‌లైపెరియార్ జలాశయం నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ జలాశయాన్ని అప్పటి బ్రిటీషు ఇంజినీర్ కల్నల్ జాన్ పెన్నీ క్విక్ నిర్మించారు. తన ఆస్తులను సైతం ఆయన ఈ నిర్మాణం కోసం వెచ్చించినట్టు చరిత్ర చెబుతోంది. ఆయనకు గౌరవం కల్పించే విధంగా తేనిలో స్మారక మందిరం, విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సీఎం స్టాలిన్ పెన్నీ క్విక్ కుటుంబానికి చెందిన సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా సీఎం పేర్కొంటూ ముల్‌లై పెరియార్ జలాశయం ప్రజల హృదయాలను తాకిందని,ప్రజా జీవనాన్ని పెంపొందించిందని గుర్తుచేస్తూ, ఇదిపూర్తిగా పెన్నీ క్విక్ సహకారమే కారణంగా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పెన్నీ క్విక్ స్వస్థలం కాంబెర్లీ పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని నెరవేరుద్దామన్నారు. జాన్ పెన్నీ క్విక్ కీర్తి చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.