
నూతన స్వర్ణ రథానికి పూజలు
కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్‌లోని మూడు శతాబ్దాల పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో భక్తుల కోర్కే మేరకు పాలకమండలి సభ్యులు కన్యకాపరమేశ్వరి అమ్మవారికి బంగారు రథం తయారు చేయించి భక్తుల కోర్కెను తీర్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నూతన స్వర్ణ రథానికి పూజలు , హోమాలను ఆలయ అర్చకులు భాస్కర పంతులు బృందం సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. బంగారు రథం కోసం ఆలయం లోపల ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారిని బంగారు రథంలో కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. జై వాసవీ ..జైజై వాసవీ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. బంగారు రథం తయారీకి విరాళాలను నగదు, వస్తువు రూపేనా అందించిన దాతలకి దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త కొల్లావేంకట చంద్రశేఖర్ అధ్యక్షతన పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్ ,దేసు లక్ష్మీ నారాయణ , ఎస్ ఎల్ సుదర్శనం, సీఆర్ కిషోర్ బాబు, టీవీ రామకుమార్, తాతా బద్రీనాథ్ కలసి ఘనంగా సత్కరించారు. ఎస్‌కేపీడీ అండ్ చారిటీస్ సెక్రటరీ కిషోర్ బాబు ఏర్పాట్లును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఊటుకూరు శరత్‌కుమార్ మాట్లాడుతూ గత ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో బంగారు తల్లికి బంగారు రథం పేరిట పథకాన్ని రూపొందించామన్నారు. తాము చేపట్టిన ఈ మహత్తర కార్యానికి దాతలు, భక్తులు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారికి స్వర్ణరథం ఏర్పాటుకు సహకరించినవారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని బంగారు రథంలో కొలువుదీరిన వాసవీ అమ్మవారిని దర్శించుకుని తరించారు.