
ఆంధ్రా ఆణిముత్యం.. వెంకట కృష్ణారావు
కొరుక్కుపేట: తెలుగు భాష పరిరక్షణ, భూదానం, అన్నదానం, చట్ట సభల్లో శాసన సభ్యుడిగా, మంత్రిగా వ్యవహరించిన గాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు ఆంధ్రరాష్ట్ర ఆణిముత్యం అని వక్తలు కొనియాడారు. చైన్నెలోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభ, మైలాపూర్‌లోని పొట్టి శ్రీరాములు స్మారక భవన ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. స్వాగతోపన్యాసంను కమిటీ కార్యదర్శి, కోశాధికారి వి కృష్ణారావు చేయగా, సభకు భవన నిర్వాహక కమిటీ ఛైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమ నిర్వాహణను కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య వ్యవహరించగా ఇందులో కమిటీసభ్యులు భువన చంద్ర, మాడభూషి సంపత్‌కుమార్, జేఎం నాయుడు, ఎంఎస్ లక్ష్మణ రెడ్డి , సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ హాజరయ్యారు. ఈ వేడుకలకు అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అవని గడ్డ శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డిలు పాల్గొని స్మారక భవనంలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న అమరజీవి భవనాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామని, ఈ భవనంలో లైబ్రరీని ఆధునీకరించి ప్రజల వినియోగానికి తీసుకుని వచ్చిన అనిల్‌కుమార్ రెడ్డిని మాగుంట ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు సంఘల నాయకులు, తెలుగు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.