
మనిదన్ దైవమాగలామ్‌లో సెల్వరాఘవన్
తమిళసినిమా: తుళ్లువదో ఇళమై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ ఆ తర్వాత కాదల్ కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ, పుదుపేట్టై, ఆయిరత్తిల్ ఒరువన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఇటీవల నటుడిగా అవతారం ఎత్తిన ఈయన విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. అదేవిధంగా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. కాగా తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం మనిదన్ దైవమాగలామ్. వ్యోమ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై విజయ సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్ మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖుషి రవి నాయకిగా నటిస్తున్న ఇందులో వైజీ మహేంద్రన్, మైమ్ గోపి, కౌసల్య, సతీష్, లిత్రిక ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ఆదివారం నటుడు ధనుష్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. చిత్ర వివరాలను దర్శకుడు వివరిస్తూ ప్రశాంతతతో కూడిన ప్రకృతి కలిగిన ఒక గ్రామంలో ప్రజల సమైక్యతను దెబ్బతీసే సంఘటన చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడ ప్రజల జీవనం విచ్ఛిన్నం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి సమస్యల పరిష్కారానికి ఒక వ్యక్తి కృషిచేస్తారన్నారు. దీంతో ఆయన్ని దేవుడిగా అక్కడి ప్రజలు భావించే ఇతివృత్తంతో రూపొందిన కథ చిత్రం మనిదన్ దైవమాగలామ్ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత విజయ సతీష్ మాట్లాడుతూ మంచి చిత్రాలతో కూడిన భారతీయ సినిమాను తయారు చేయాలని ప్రారంభించిన సంస్థ వ్యోమ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అని పేర్కొన్నారు. తమ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం టైటిల్ ఆవిష్కరించిన ధనుష్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి రవివర్మ కే.చాయాగ్రహణం, ఏకే.ప్రియన్ సంగీతాన్ని అందిస్తున్నారు.