
అవయవదానంలో తమిళనాడు ఫస్ట్
తిరువళ్లూరు: అవయవాల దానం చేసే వారి సంఖ్య దేశంలోనే తమిళనాడు మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఆవడి మోరై గ్రామానికి చెందిన చెల్లప్పన్(53). బ్రెయిన్‌లో ఏర్పడిన సమస్యల కారణంగా కీళ్‌పాక్కం వైద్యశాలలో వుంచి వైద్యసేవలను అందించారు. అయితే చికిత్స ఫలించకపోవడంతో అతడు బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. దీంతో చెల్లప్పన్ బంధువులు అవయువాలను దానం చేశారు. అవయవాలను దానం చేసిన వ్యక్తి మృతదేహానికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం తరపున నివాళి అర్పించాల్సి ఉంది. ఇందులో భాగంగానే మోరై గ్రామానికి వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం, మైనారీటి సంక్షేమశాఖ మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, మాధవరం ఎమ్మేల్యే సుదర్శనం తదితరులు చెల్లప్పన్ మృతదేహం వద్ద సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి అవయువాలను దానంగా స్వీకరించి వాటిని పలువురికి అమర్చి పునర్‌జీవనం ఇచ్చినట్లు వివరించారు. అవయవాలను దానం చేసే వ్యక్తి మృతదేహానికి ప్రభుత్వ తరపున నివాళులర్పించే ఉత్తర్వులను 2023లో ముఖ్యమంత్రి స్టాలిన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చెల్లప్పన్ మృతదేహానికి నివాళి అర్పించినట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే అవయవదానంపై అవగాహన పెరిగిందన్నారు. ఏటా దేశంలోనే అవయవాలను దానం చేసే రాష్ట్రాలలో తమిళనాడు మొదటి స్థానంలో ఉందన్నారు. ఇప్పటి వరకు బ్రెయిన్‌డెడ్ అయ్యి అవయవాలను దానం చేసిన వారి సంఖ్య చెల్లప్పన్‌తో కలిసి 500 చేరిందన్నారు. భవిషత్‌లోనూ అవయవాలను దానం చేసే వారి సంఖ్య పెరుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. కాగా మంత్రి వెంట ఆరోగ్యశాఖ డైరెక్టర్ తోరణిరాజన్, అవయవదానం విభాగపు కమిషన్ కార్యదర్శి గోపాలకృష్ణన్, కీళ్‌పాక్కం వైద్యశాల డీన్ కవిత, డిప్యూటి డైరెక్టర్ ప్రియారాజ్, ప్రభాకరన్, ఆర్డీవో రవిచంద్రన్ పాల్గొన్నారు.