
నిబంధనలు అతిక్రమించి మట్టి తవ్వకాలు
– లారీలను ముట్టడించి ఆందోళన
తిరువళ్లూరు: నిబంధనలను అతిక్రమించి మట్టి తవ్వకాలు చేస్తున్న క్వారీ నిర్వాహకుల తీరును ఖండిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కం గ్రామంలో ప్రభుత్వం మట్టి వెలికి తీయడానికి క్వా రీకి గత పది రోజుల క్రితం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రాంతంలో మాత్రమే మట్టి వెలికితీయాలి. మూడు అడుగుల కంటే ఎక్కువగా మట్టి తవ్వకాలు చేయకూడదు. సెలవురోజు ల్లో మట్టి తీయకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వాహకులు మట్టి వెలికితీస్తున్నట్టు స్థానికులు వాపోయారు. మూడు అడుగుల కంటే ఎక్కువగా మట్టిని తీస్తున్నారని, అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీలను అడ్డుకుని స్థానికులు ఆందోళన చేశారు. దీంతో వందలాది లారీలు నిలిచిపోయాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. అనంతరం లారీలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. కాగా లారీలను అడ్డుకుని స్థానికులు ఆందోళనకు దిగడంతో గంట పాటు క్వారీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.