
ఘనంగా పోలీస్ దినోత్సవం
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6న పోలీస్ దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. దీంతో వేలూరు జిల్లాలో పోలీస్ దినోత్సవాన్ని ఎస్పీ మయిల్‌వాగనం అధ్యక్షతన నేతాజీ మైదానంలో పోలీసు అధికారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలకు చెందిన పోలీసులు, హోంగార్డులు వారి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు క్రీడాపోటీలు, రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్పీ పరిశీలించారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఎస్పీ పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన పోలీసులకు బహుమతులను అందజేశారు. జిల్లాలోని పోలీసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.