
ఇంటింటికీ పథకాలను చేర్చుదాం!
– బీజేపీ నేతల నిర్ణయం
సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇంటింటా ప్రజల్లోకి తీసుకెళ్దామని బీజేపీ నేతలు నిర్ణయించారు. కోయంబత్తూరు సుందరపురంలోని సెల్వం మహల్‌లో తమిళనాడు బీజేపీ నేతృత్వంలో సేవ ల విస్తృతం లక్ష్యంగా సేవా సంగథాన్ పేరిట రాష్ట్ర స్థాయి వర్క్ షాపు శనివారం జరిగింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, జాతీయ ఇన్‌చార్జ్ అరవింద్ మీనన్, ప్రధాన కార్యదర్శి కేశవ్ వినాయకన్‌తో పాటూ సీనియర్ నేతలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బృందాల వారీగా వీరికి వర్క్‌షాపు నిర్వహించి పలు సూచనలు,సలహాలు ఇచ్చారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, సేవా హి సంగథన్ స్పూర్తి గురించి వివరించారు. పీఎం మోదీ జన్మదినం, మహాత్మా గాంధీ జీ, లాల్ బహదూర్ శాస్త్రి జీ జయంతి వరకు నిర్వహించబడే సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధంచేసి వర్క్ షాపుకు హాజరైన వారికి అందజేశారు. పీఎం మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు , అందిస్తున్న పథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్దామని సూచించారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వ అవినీతి, దుష్పరిపాలనను బయటపెట్టడం లక్ష్యంగా ముందుకెళ్దామన్నారు. సేవ, సామాజిక సామరస్యం మరియు జాతి నిర్మాణం సందేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లా లని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటినీ చేరుకోవాలని సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని, ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయాలన్న నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు.

ఇంటింటికీ పథకాలను చేర్చుదాం!