
పోటీ సర్వసభ్య సమావేశానికి రామన్న కసరత్తు
సాక్షి, చైన్నె: పీఎంకేలో అధికార సమరాన్ని కొలిక్కి తెచ్చే విధంగా అన్బుమణి ఓ వైపు దూకు పెంచితే, ఆయన వ్యూహాలను తిప్పి కొట్టే దిశగా రాందాసు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పోటీ సర్వ సభ్య సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు. పీఎంకేలో నేనంటే..నేనే అధ్యక్షుడ్ని అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న రాజకీయ సమరం ఆసక్తికర మలుపుతో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 9న మహాబలిపురం వేదికగా పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని తన మద్దతు దారులతో కలిసి నిర్వహించేందుకు అన్బుమణి చర్యలు చేపట్టారు. పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకునే వ్యూహంతో ఈ భేటీకి అన్బుమణి చర్యలు చేపట్టినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అదే సమయంలో రాందాసుసైతం ఎత్తుకు పైఎత్తులు వేయడానికి రెడీ అయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు, గౌరవ అధ్యక్షుడు జికే మణి , ప్రధాన కార్యదర్శి మురళీ శంకర్‌ల పేరిట పార్టీ సర్వ సభ్యసభ్యులందరికి మంగళవారం నుంచి లేఖలు వెళ్తుండటం గమనార్హం. తొమ్మిదో తేది పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న సమావేశానికి ఎవ్వరూ హాజరు కాకూడదన్న హెచ్చరికలు ఆ లేఖలో ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఈనెల 17న తన రాందాసు నేతృత్వంలోసర్వ సభ్య సమావేశానికి కసరత్తులు జరుగుతున్నట్టు, వేదిక తదితర వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆ లేఖలో పేర్కొని ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈపరిణామాలు కాస్త పీఎంకే సర్వసభ్య సమావేశంలో పాల్గొనే సభ్యులలో తీవ్ర గందరగోళానికి దారి తీసినట్లు కనిపిస్తోంది.