
చైన్నెలో ముందు జాగ్రత్తలపై సమీక్ష
సాక్షి, చైన్నె: వర్షాల నేపథ్యంలో చైన్నెలో చేపట్టిన ముందు జాగ్రత్తలపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మంత్రులు, అధికారులతో మంగళవారం సమీక్షించారు. మైలాపూర్‌లో సింగార చైన్నె 2.ఓ ప్రాజెక్టు మేరకు రూ. 6.60 కోట్లతో నిర్మించిన రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, అదనపు పాఠశాల భవనాలను ప్రారంభించారు. నైరుతీ రుతు పవనాలు పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాల మీద అధిక ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కోయంబత్తూరు, నీలగిరి, తెన్‌కాశి, తేనిలోకు బుధవారం కూడా అలర్ట్ ప్రకటించారు. నీలగిరికి మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో చైన్నె, శివారులలో రాత్రులలో వర్షాలు పడుతూ వస్తున్నాయి.చైన్నె మీద సైతం చివరి క్షణంలో నైరుతీ ప్రభావం పడే అవకాశాలు ఉండ వచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, ఈశాన్యం ఆరంభంతోనే భారీ వర్షాలకు అవకావాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతోగ్రేటర్ చైన్నె పరిధిలో చేపట్టిన ముందు జాగ్రత్తలపై మంత్రులు నెహ్రు, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్, సీఎస్ మురుగానందంతో పాటుగా అధికారులతో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సమీక్షించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఇక చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. చైన్నె శివారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని,నగరంలో వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలలో ముందు జాగ్రత్తలు విస్తృతం చేయాలని ఆదేశించారు. అనంతరం మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నారాయణ స్వామి ఎస్టేట్‌లో డిప్యూటీ సీఎం పర్యటించారు. చైన్నె మిడిల్ స్కూల్‌లో సింగర చైన్నె 2.0 ప్రాజెక్ట్ కింద రూ. 6.60 కోట్లతో నిర్మించిన రెండు అంగన్‌వాడీ భవనాలు, బాలల విద్యా కేంద్రాలలో అదనపు పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎం. సుబ్రమణియన్, మేయర్ ప్రియ, ఎమ్మెల్యే వేలు, డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మైలాపూర్‌లో సింగారంగా 2.ఓ