
బల్లి పడిన ఆహారం తిన్న 30 మందికి అస్వస్థత
● నలుగురి పరిస్థితి విషమం
అన్నానగర్: శ్రీపెరంబత్తూర్ సమీపంలో ఉన్న పాల్ నల్లూర్ ప్రాంతంలో కారు విడిభాగాలను తయారు చేసే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ పనిచేసే కార్మికులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఆహారం తయారు చేసి వడ్డిస్తుంది. సోమవారం కార్మికులు భోజనం చేస్తుండగా ఆహారంలో బల్లి ఉందని తెలిసింది. దీని కారణంగా 30 మందికి పైగా కార్మికులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వారిని శ్రీపెరంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత 26 మంది కార్మికులు ఇంటికి పంపించారు. మిగిలిన నలుగురికి (4) మెరుగైన చికిత్స అందిస్తున్నారు. శ్రీపెరంబుదూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత వారం శ్రీపెరంబుదూర్ ప్రాంతంలోని మరో ఫ్యాక్టరీలో సాంబారులో బల్లి పడిన ఆహారం తిన్న 60 మంది కార్మికులు అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం గమనార్హం.
బస్సు బోల్తా – 15 మందికి తీవ్ర గాయాలు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని మిన్నూరు వద్ద ఓ ప్రైవేటు ఏసీ బస్సు బోల్తా పడి అందులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఆంధ్ర రాష్ట్రం విజయవాడ నుంచి ఓ ఏసీ బస్సు కోవైకి వెళ్లి సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. మంగళవారం వేకువ జామున సుమారు 2 గంటలకు గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ఆంబూరు సమీపంలోని మిన్నూరు వద్ద జాతీయ రహదారిపై వస్తుండగా.. అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఒక్కసారిగా గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి వెంటనే బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ఆంబూరు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆంబూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై సుమారు 3 కిలో మీటర్ల దూరం వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
తమిళనాడులో 280 పోలీస్ స్టేషన్లను ఆధునీకరణ
●త్వరలో ఇన్‌స్పెక్టర్ల నియామకం
కొరుక్కుపేట: తమిళనాడులోని 280 పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. వివరాలు.. తమిళనాడు పోలీస్ శాఖ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల పరిధిలో 1,366 పోలీస్ స్టేషన్లు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో 424 పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న జరిగిన పోలీసుల వినతి మేరకు..ముఖ్యమంత్రి స్టాలిన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోని 424 పోలీస్ స్టేషన్లలో 280 పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మాట్లాడుతూ ఇకపై ఈ స్టేషన్లలోనూ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయవచ్చని, కుల, మతపరమైన సమస్యలను నియంత్రించవచ్చని, పోలీస్ స్టేషన్ల నాణ్యతను మెరుగుపరచడానికి రూ. 1.18 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్ 280 పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తూ ఒక సర్క్యులర్ జారీ చేశారు. మిగిలిన పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడ్ పక్రియను త్వరలోనే చేపడుతామని పేర్కొన్నారు.
ఇకపై రూ. 20 వేలలోపే నగదులావాదేవీలకు అనుమతి
●రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు
సాక్షి, చైన్నె: ఆస్తి అమ్మకాలలో రూ. 20 వేలలోపు నగదు లావాదేవీలు ఉండాలని, అంతే కంటే ఎక్కువగా ఉన్నట్టు తేలితే ఐటీకీ సమాచారం ఇవ్వాలని రిజిస్ట్రార్‌లకు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గృహాలు, స్థలాల అమ్మకాలలలో నల్లధన ప్రవాహాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆదాయ పన్ను శాఖ వివిధ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ల కార్యాలయ అధికారులు, రిజిస్టార్‌లకు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు మంగళవారం జారీ అయ్యాయి. గృహాలు, స్థల అమ్మకాలలో ప్రభుత్వ నిర్ణీత రేటు, తదిరత వ్యవహారాలలో నగదు లావాదేవి రూ. 20 వేల కంటే అధికంగా జరిగిన పక్షంలో వివరాలను ఐటీకి అందజేయాలని సూచించారు. 20 వేల కంటే అధికంగా అంటే, ఇక మీదట బ్యాంక్, డీడీల ద్వారా వ్యవహారాలు జరిగే రీతిలో చర్యలు తీసుకోనున్నారు.