
పర్యటనల జోరు!
● నైనార్ వంతు...!
● నియోజకవర్గ పర్యటనకు సన్నద్ధం
● కలక్కాడులో పళణి
● కంచిలో ప్రేమలత
సాక్షి, చైన్నె : ప్రజలను ఆకర్షించేందుకు నేతలు పర్యటనలను హోరెత్తిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రం నియోజకవర్గాల పర్యటనకు సన్నద్దం అవుతున్నారు. తొలుత తిరునల్వేలిలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ప్రజా చైతన్య యాత్రలో దూసుకెళ్తున్నారు. మంగళవారం ఆయన తిరునల్వేలి జిల్లా కలక్కాడు పరిసరాలలో పర్యటించారు. దివ్యాంగులు, పిల్లలతో మాట్లాడారు.వారికి సంక్షేమ సహాయకాలను పంపిణీ చేశారు. పళణి పర్యటన సుడిగాలి వేగంతో సాగుతూ వస్తున్నది. అదే సమయంలో పీఎంకే నేత అన్బుమణి రాందాసు సైతం హక్కుల సాధన నినాదంతో ప్రజా క్షేత్రంలోకి పాదయాత్రతో ఉరకలు తీస్తున్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులతో బలాన్ని నిరూపించుకునే అన్బుమణి ఈ పయనం మంగళవారం రాణిపేట తదితర ప్రాంతాలలో సాగింది. ఇక డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, కోశాధికారి సుదీశ్, విజయకాంత్ వారసుడు విజయప్రభాకరన్ కెప్టెన్ రథయాత్రతో కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే విధంగా దూసుకెళ్తున్నారు. ఈ పర్యటన మంగళవారం కాంచీపురంలో సాగింది. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని పార్టీ డీఎంకే కూటమిలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోన్నది. డీఎంకేలో 12 సీట్లను డీఎండీకే ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, తాను సైతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రజా క్షేత్రంలో ఉరకలు తీయడానికి సన్నద్దం అవుతున్నారు.
నైనార్ వంతు..
నియోజకవర్గ పర్యటన పేరిట యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సన్నద్ధం అవుతున్నారు. అధ్యక్షుడిగా పగ్గాలుచేట్టినానంతరం అన్నాడీఎంకే కూటమితో కలిసి పయనిస్తున్న నైనార్ నాగేంద్రన్, తమ బలాన్ని చాటే దిశగా నియోజకవర్గ పర్యటనకు నిర్ణయించారు. యాత్ర రూపంలో నియోజకవర్గాలలో పర్యటించడమే కాకుండా, బూత్ కమిటీల పనితీరు పరిశీలన, బలోపేతంకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడవ తేది తిరునల్వేలిలో జరిగే సమావేశంలో తొలి విడతగా అదే జిల్లాలోని నియోజకవర్గాలలో ఆయన పర్యటనకు కార్యచరణ సిద్ధం చేయనున్నారు. ఈ యాత్రకు మరింత ఉత్సాహం, బలం చేకూర్చే విధంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పర్యటనల జోరు!

పర్యటనల జోరు!