
తిరుత్తణిలో ప్రేమలత పాదయాత్రకు ఘనస్వాగతం
● ప్రేమలతకు మురుగన్ వేల్ బహూకరణ
తిరుత్తణి: తిరుత్తణిలో పాదయాత్ర చేపట్టిన డీఎండీకే ప్రదాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌కు మురుగన్ ఆయుధం వేల్ బహూకరించారు. మంచి మనస్సులు కోసం గడపగడపకూ పేరిట డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రను గుమ్మడిపూండిలో ఆదివారం ప్రారంభించారు. రెండవ రోజు తిరుత్తణిలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. అరక్కోణం రోడ్డులోని కొత్త బస్టాండు నుంచి ప్రారంభమైన పాదయాత్రలో డీఎండీకే జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నాయి. ముందుగా క్రేన్ సాయంతో గజమాలను ప్రేమలతకు సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మురుగన్ ఆయుధం వేల్‌ను మురుగన్ సన్నిధిలో పూజలు చేపట్టి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా విజయకాంత్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రేమలత తన పాదయాత్రను ప్రారంభించారు. అరక్కోణం రోడ్డు మార్గం ద్వారా పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బస్టాండు, మపోసీ రోడ్డు మార్గంలో వెళ్లగా వర్షం స్వాగతం పలకడంతో వర్షంలో సైతం పట్టణ ప్రజలకు ప్రయాణికులకు అభివందనం చేస్తూ ముందుకు సాగారు. డీఎండీకే కోశాధికారి సుధీస్ తదితరులు పాల్గొన్నారు.