
పుదుచ్చేరిలోనూ వార్
● నీతి ఆయోగ్‌కు రంగన్న దూరం ● ఈసారి విజయ్ వైపు చూపా?
సాక్షి, చైన్నె: తమిళనాడు తరహాలో, తాజాగా పుదుచ్చేరిలోనూ అధికార వార్ బయలు దేరినట్టుంది. లెఫ్టినెంట్ గవర్నర్ కై లాస్‌నాథన్ తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నట్టు ఎన్‌ఆర్ కాంగ్రెస్ వర్గా లు ఆరోపణలు అందుకున్నారు. ఇందుకు నిరసన గా తమ నేత , సీఎం రంగస్వామి ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించినట్టుగా ప్రకటించడం చర్చకు దారి తీసింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు పూర్తయినా కేంద్రం నుంచి సహకారం అన్నది లేదని ఇప్పటికే పలు సందర్భాలలో సీఎం రంగస్వామి తన ఆవేదనను వ్యక్తం చేసి ఉన్నారు. అదే సమయంలో తమ కూటమి పుణ్యమా బీజేపీ పుదుచ్చేరిలో గట్టెక్కినట్టుగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నాయి. ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న, కొందరు బీజేపీ సభ్యులు, వారికి మద్దతు ఇచ్చే స్వతంత్ర సభ్యుల రూపంలో సీఎం రంగస్వామి ఇంటా బయట ఇరకాటాలను ఎదుర్కోవాల్సినపరిస్థితి తప్పడం లేదు.
లెఫ్టినెంట్ గవర్నర్‌తో వార్..
తొలుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను తమిళిసై నిర్వహించారు. ఈ సమయంలో అధికార వార్ అన్నది చాప కింద నీరులా సాగినా, కేంద్ర ప్రభుత్వానికి అణిగిమనిగి ఉండాల్సిన పరిస్థితి రంగన్నకు తప్పలేదు. ఆమె స్థానంలో ప్రస్తుతం కై లాస్ నాథన్ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన అనేక ఫైల్స్‌ను ఆమోదించకుండా వెనక్కి పంపిస్తున్నట్టు సమాచారం. కేంద్ర హోంశాఖ సైతం తమప్రభుత్వ డిమాండ్లను పక్కన పెడుతూ రావడాన్ని సీఎం రంగస్వామి తీవ్రంగా పరిగణించినట్టు ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి నిధులు ఇవ్వక పోగా, రాష్ట్రహోదా ఇవ్వడంలోనూ కేంద్ర పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో 2026 ఎన్నికలలో బీజేపీని పక్కన పెట్టే దిశగా రంగన్న వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పుదుచ్చేరిలో విజయ్ తమిళగ వెట్రి కళగం అభిమాన సందోహం ఎక్కువే. ఈ దృష్ట్యా, విజయ్‌తో కలిసి ఆయన అడుగులు వేయడానికి వ్యూహ రచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గతంలో విజయ్‌ను రంగస్వామి కలిసిన సందర్భాలు కూడా ఉండడం గమనార్హం. ఈ పరిస్థితులలో ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ భేటీని రంగస్వామి బహిష్కరించారు. బీజేపీ కూటమి ప్రభుత్వానికి సీఎంగా ఉన్న రంగస్వామి నీతి అయోగ్‌కు దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఆ పార్టీ వర్గాలుపేర్కొంటూ, గవర్నర్ తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని, అనేక ఫైల్స్‌ను వెనక్కు పంపించి ఉన్నారని, కేంద్రం నుంచి నిధులు సక్రమంగా రాని దృష్ట్యా, నీతి అయోగ్‌ను తమ నేత బహిష్కరించినట్టుగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండటంతో పుదుచ్చేరి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.