
ఉత్తీర్ణత పెంపునకు అందరూ కృషి చేయాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రతి టీచర్ కష్టపడి పనిచేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, ప్లస్–1, ప్లస్‌టూ పరీక్ష ఫలితాల్లో వందశాతం మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి, ప్లస్‌టూ పరీక్ష ఫలితాల్లో వేలూరు జిల్లా వెనుకంజలో ఉందని, జిల్లాను మొదటి స్థానానికి తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు చేసేందుకు సిద్ధంగా ఉందని, అయితే ఉత్తీర్ణత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా విద్యాబోధన చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాస్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల హెచ్‌ఎంలను అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వందశాతం మార్కులు సాధించిన మొత్తం 1,325 మంది టీచర్లను కలెక్టర్ అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్తికేయన్, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, విద్యాశాఖ సీఈఓ దయాళన్ తదితరులు పాల్గొన్నారు.