
వ్యక్తి ఆత్మహత్య
అన్నానగర్: ఇద్దరు కుమారులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్న బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా అన్నపట్టి సమీపంలోని కుప్పండం పాళయం పంచాయతీ వన్నియార్ కోవిల్ మేడు ప్రాంతానికి చెందిన కపిల్ ఆనంద్ (41) డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య నదియా, హరి రంజిత్, విఘ్నేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. తిరుచెంగోడ్ ప్రభుత్వ పురుషుల హయ్యర్ సెకండరీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న హరి రంజిత్, అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విఘ్నేష్ కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ప్లస్–2, పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. కపిల్ ఆనంద్ తన ఇద్దరు కుమారులు పాస్ కాకపోవడంతో మనస్తాపంతో చెందుతూ వచ్చాడు. ఈ స్థితిలో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రూ.5 కోట్ల విలువైన
గంజాయి స్వాధీనం
కొరుక్కుపేట: సింగపూర్ నుంచి కోయంబత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్లు విలువైన అధిక నాణ్యత గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న విమానంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెనన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కోయంబత్తూరు విమానాశ్రయానికి వచ్చిన సింగపూర్ ప్రయాణికులను అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో, ఒక ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా అందులో దాదాపు 100 గ్రాముల హై–గ్రేడ్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేసి, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడు బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా వచ్చాడని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 25 మందికి సాయం
తిరువళ్లూరు: ఉలుందై పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్దులు వందశాతం ఉత్తీర్ణత సాధించిన క్రమంలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం 25 మందికి తన సొంత నిధులతో 2.50 లక్షల రూపాయలను పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఎంకే.రమేష్ అందజేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఉలుందైలో ప్రభుత్వ హైస్కూల్ వుంది. ఇక్కడ ఇటీవల నిర్వహించిన పదవ తరగతి పరిక్షలకు పాఠశాల నుంచి 25 మంది హాజరుకాగా, వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం పది వేల రూపాయల చొప్పున 25 మందికి అందించాలని నిర్ణయించారు. కాగా గత ఐదు సంవత్సరాల కాలంలో 8 నుంచి పదవ తరగతి వరకు చదివిన విద్యార్దులకు ఉచిత సైకిల్, ఉచిత మెడికల్ క్యాంపులు, పాఠశాలకు అదనపు తరగతి గదిని సొంత నిధులతో రూ.40 లక్షలతో నిర్మాణం తదితర పలు సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. కాగా పదవ తరగతి విద్యార్దుల ఉన్నత విద్యకు పంచాయతీ మాజీ అధ్యక్షుడు చేసిన ఆర్థిక సాయంపై పలువురు అభినందించారు.
అక్రమ ఇళ్ల కూల్చివేత
కొరుక్కుపేట: అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడంతో 150 కుటుంబాల ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు అనకాపుత్తూరు అడయార్ నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేత బుధవారం ప్రారంభమైంది. ప్రజలు దీనిపై నిరసన తెలిపారు. రెవెన్యూ శాఖ, పోలీసుల సహాయంతో వారిని ఖాళీ చేయించి, ఆక్రమణలకు గురైన ఇళ్లను కూల్చివేసింది. నామ్ తమిళ్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ బాధితులను కలిసి, తన సంఘీభావం తెలిపారు. గురువారం ఉదయం వరకు దాదాపు 150 కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి, తమ వస్తువులను తీసుకుని, కన్నీళ్లతో వెళ్లిపోయాయి. వారికి హౌసింగ్ బోర్డు అపార్ట్‌మెంట్లలో ఇళ్లు కేటాయించి, టోకెన్లు ఇచ్చారు. అడయార్ నది ఒడ్డున ఉన్న సుమారు 600 అక్రమ ఇళ్లను ఇప్పటికే సర్వే చేసి, వాటికి నోటీసులు జారీ చేయడం గమనార్హం.