వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవగాహన
తిరుత్తణి: సాగు విస్తీర్ణం పెంచి, కూలీల సమస్య పరిష్కరించేందుకు వీలుగా రైతులు వ్యవసాయ అత్యాధునిక యంత్రాలు వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వ్యవసాయశాఖ విభాగం ఆధ్వర్యంలో పంట సాగులో యంత్రాల వినియోగానికి సంబంధించి రైతులకు అవగాహనతోపాటు యంత్రాలు వినియోగించడం, యంత్రాల సమస్యలు పరిష్కరించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం వరినాట్లు, కోత, చెరుకు కట్టింగ్, దుక్కి దున్నడం, నారు పోసే యంత్రం, ట్రాక్టర్, జేసీబీ వినియోగం సహా అత్యాధునిక యంత్రాలు శిబిరంలో ఉంచి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ శిబిరానికి మండల వ్యవ సాయ విభాగ సహాయ ఇంజినీర్ రాజవేల్ అధ్యక్షత వహించారు. జిల్లా వ్యవసాయ ఇంజినీరింగ్ విభాగ చీఫ్ ఇంజినీర్ గణేశన్, ఆర్డీఓ కనిమొళి శిబిరాన్ని ప్రా రంభించారు. లాభసాటి పంటసాగు, అధిక దిగుబడికి సంబంధించి యంత్రాల వినియోగం, అద్దెకు అందుబాటులో ఉన్న యంత్రాలు, సబ్సిడీ ద్వారా అందుతున్న యంత్రాలపై అవగాహన కల్పించారు.


