కోలాహలం.. గంగయమ్మన్ జాతర
● ఐదు లక్షల మంది దర్శనం
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం గంగయమ్మన్ ఆలయ జాతరను పురస్కరించుకుని శిరస్సు జాతర గురువారం ఉదయం కోలాహలంగా జరిగింది. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగయమ్మన్ జాతర ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులోభాగంగా గురువారం ఉదయం ముత్తాలమ్మన్ ఆలయంలోని అమ్మన్ శిరస్సుకు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో భక్తుల కోలాహలం మధ్య శిరస్సు ఊరేగింపుగా తీసుకొచ్చి పాలారు నది ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహానికి అమర్చారు. ఊరేగింపులో ఓంశక్తి భక్తులతోపాటు, భక్తులు వివిధ వేషధారణలు పులివేశం, స్వామి వేషాలు ధరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అక్కడక్కడ నీరు, మజ్జిగ, అంబలి ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ నిత్య, ఆలయ ధర్మకర్త ఆర్‌పీఎస్ సంపత్, ఆర్‌జేఎస్ కార్తికేయన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎసీమదివాణన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగింపులో రాత్రి బాన వేడుకలను ఏర్పాటు చేశారు.


