ఎంపీలతో రైల్వే జీఎం భేటీ
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ గురువారం పాలక్కాడు డివిజన్ పరిధిలోని లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలతో సమావేశమయ్యారు. దక్షిణ చైన్నె రైల్వే పరిధిలోని పాలక్కాడు డివిజన్‌లో ఉన్న వివిధ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని రైల్వే లైన్లలో పూర్తి చేసిన పనులు, కొనసాగుతున్న పనుల గురించి స్థానికంగా ఎంపీలకు వివరించారు. ప్రయాణికులకు మెరుగు పరచాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపయాల మెరుగు అంశాలను గురించి ఈ సందర్భంగా ఎంపీలు పలు సూచనలు చేశారు. తమిళనాడులోని పొల్లాచ్చి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ కె. ఈశ్వర స్వామి, కేరళలోని లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలు,రాజ్య సభ సభ్యులు కె. రాధాకృష్ణన్, ఎంకే రాఘవన్, రాజ్ మోహన్ షఫీ, శ్రీకందన్, డా. వి. శివదాసన్, పి.పి. సునీర్, శ్రీమతి పి.టి. ఉష ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. సింగ్ పేర్కొంటూ, ప్రయాణికుల సౌకర్యాలను పెంపొందించడానికి ఇటీవల కాలంలో తీసుకున్న చర్యలు, వివిధ కార్యక్రమాలను వివరించారు. పాలక్కాడ్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ చతుర్వేది, దక్షిణ రైల్వే ప్రధాన విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పొల్లాచ్చి నియోజకవర్గం పరిధిలో కినత్తు కడవు వద్ద కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి, పొల్లాచిలో ప్లాట్‌ఫామ్ షెల్టర్ అప్‌గ్రేడ్‌లు, మదుకరైలో హైలెవల్ ప్లాట్‌ఫామ్ నిర్మాణాల పూర్తి గురించి వివరించారు.


