
పాండియన్ చెందిన 16 స్థలాలపై ఈడీ దాడులు
● రూ.4.73 కోట్లు స్వాధీనం
కొరుక్కుపేట: గత అన్నాడీఎంకే హయాంలో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖ పరిశీలకుడిగా పాండియన్ పనిచేశారు. తన హయాంలో ఆదాయానికి మించి ఆస్తులు చేర్చాడన్న ఫిర్యాదు మేరకు సైదాపేటలోని పానగల్ హౌస్‌లోని సూపరింటెండెంట్ ఇంజినీర్ పాండియన్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు 2021 లో దాడులు చేసి రూ.1.37 కోట్లు చెక్క చూపని నగదు, 3 కిలోల బంగారం, వెండి, వజ్రాలు, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ పాండియన్‌పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అన్నాడీఎంకే హయాంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అలా పొల్యూషన్ పారెస్టు బోర్డుకు సంబంధించిన పనులన్నీ పాండియన్ స్వయంగా చూసుకునే వారు. అదే సమయంలో చాలా శక్తి వంతమైన అధికారిగా ఉద్భవించారు. అందుల్ల తన అధికారాన్ని దుర్వినియోగం చేసే వివిధ కంపెనీలకు పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేశారు. సంబంధిత కంపెనీల నుంచి ఆయన అనేక కోట్ల రూపాయలు లంచాలు అందుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. మరోవైపు పర్యావరణ శాఖ మాజీ అధికారి పాండియన్‌పై ఆక్రమ నగదు బదిలీ చట్టం కింద అవినీతి నిరోధక బ్యూరో నమోదు చేసిన కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వీకరించింది. అక్రమంగా నగదు మార్పిడి చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో చైన్నెలోని సాలిగ్రామంలో నివాసముంటున్న పాండియన్ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు దాడులు చేశారు. అతని నుంచి లబ్ధిపొందిన కంపెనీ డైరెక్టర్లు ఇళ్లు చైన్నెతోపాటూ వెల్లూరు లోని మొత్తం 16 ప్రాంతాల్లో దాడు చేశారు. మొత్తం 4.73 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో కేసుకు సంబందించిన డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు, ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు.
జూన్ 15 నుంచి కొత్త మినీ బస్సు పథకం
కొరుక్కుపేట: రవాణా సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో జూన్ 15వ తేదీ నుంచి కొత్త మినీబస్సు పథకం అమల్లోకి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడులో 2,930 మినీ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సు సర్వీసులను మెరుగుపరిచేందుకు కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. తదనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం గతేడాది జూన్‌లో కొత్త సమగ్ర మినీ బస్సు పథకం జాబితాను విడుదల చేసింది. సంబంధిత అధికారిక గెజిట్‌లో ప్రైవేట్ మినీ బస్సులకు రవాణా సౌకర్యం లేని చోట్ల 17 కి.మీ. సర్వీస్ పాయింట్ల వద్ద నడపడానికి అనుమతి ఇవ్వబడింది. ఈ ప్రాజెక్టు ద్వారా 100 కుటుంబాలకు పైగా ఉన్న ప్రాంతాలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. అలాగే చైన్నెలో మినీ బస్సులు నడపడానికి అనుమతి లేదు. అయితే రైతుల అవసరాలను బట్టి తిరువొత్తియూరు, మనలి, మాధవరం, అంబత్తూరులకు మినీబస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు.
జిల్లాలో పార్టీ సర్వనాశనం తథ్యం
● పళణికి కేడర్ లేఖ
సాక్షి, చైన్నె: పార్టీ సర్వనాశనం తథ్యమని అన్నాడీఎంకే తిరునల్వేలి జిల్లాకు చెందిన కేడర్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి లేఖాస్త్రం సంధించారు. తిరునల్వేలికి చెందిన నైనార్ నాగేంద్రన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో తన సొంత జిల్లాపై ఆయన పూర్తి స్థాయి పట్టుసాధించే పనిలో పడ్డారు. పొరుగున ఉన్న తెన్‌కాశి జిల్లాలోనూ ఆయన పలుకుబడి క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు అన్నాడీఎంకేలో ఉమ్మడి తిరునల్వేలి జిల్లాలో నాగేంద్రన్ చక్రం తిప్పి ఉన్నారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో నైనార్ చుట్టుపై రెండు జిల్లాలకు చెందిన వారంతా గుమిగూడే పనిలో పడ్డారు. ఇందులో అన్నాడీఎంకే అసంతృప్త నేతలే కాదు, అన్నాడీఎంకే నేతలు కూడా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదేసమయంలో అన్నాడీఎంకేను ఈ రెండు జిల్లాలో నిర్వీర్యం చేసి బీజేపీ పలుకుబడి పెంచడమే కాకుండా, ఇక్కడి అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలలో బలం చాటే దిశగా నైనార్ వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అత్యధిక స్థానాలలో ఇక్కడ బీజేపీ పోటీ చేసే దిశగా ఆయన కార్యాచరణ వేగవంతం చేసినట్టు గుర్తించిన అన్నాడీఎంకే కేడర్ ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి లేఖ రాయడం గమనార్హం. జిల్లాలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, నియోజవర్గాలను బీజేపీకి కేటాయించిన పక్షంలో అన్నాడీఎంకే ఇక అడ్రస్సు గల్లంతైనట్టే అని ఆ లేఖలో హెచ్చరించడం గమనార్హం.