
కమనీయం..దేవసేన కల్యాణం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ చైత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవసేన కల్యాణోత్సవం గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన గురువారం రాత్రి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామిని దేవసేన మండపానికి తీసుకొచ్చి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదారులు, భక్తులు సారెను ఊరేగింపుగా దేవసేన మండపం వద్దకు తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి దేవసేన సమేత మురుగన్ కల్యాణోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ శ్రీదరన్, జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.