
చిత్ర పౌర్ణమికి ఏర్పాట్లు సిద్ధం
● గిరివలయం వెళ్లే భక్తులు కర్పూరం వెలిగించేందుకు, కొండ ఎక్కడంపై నిషేధం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో ఈనెల 11, 12వ తేదీల్లో జరిగే చిత్ర పౌర్ణమికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీదరన్ అన్నారు. గురువారం ఉదయం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నామలైయార్ ఆలయంలో జరిగే ఉత్సవంలో చిత్ర పౌర్ణమి వేడుకల వివరాలను వెల్లడించారు. ఈనెల 11న సాయంత్రం నుంచి 12వ తేదీన రాత్రి 10.45 గంటలకు చిత్ర పౌర్ణమి ఉందన్నారు. ఆ సమయంలో గిరివలయం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకమని తెలిపారు. దీంతో ఈ చిత్ర పౌర్ణమికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సుమారు 10 లక్షల మంది వచ్చి గిరివలయం చేస్తారని ఆలయ నిర్వాహకులు అంచనా వేశారు. చిత్ర పౌర్ణమి రోజున ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి ఉదయం 11 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఉంచాలని అదేవిధంగా ప్రత్యేక దర్శనాలను యదావిఽధిగా దర్శించుకునేందుకు అనుమతించాలన్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో మజ్జిగ ప్యాకెట్లు, చలి వేంద్రాలు, వైద్య సదుపాయాలు తదితర వాటితో పాటూ అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. అదేవిధంగా అంబులెన్స్ వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గిరివలయం రోడ్డులో భక్తులకు అవసరమైన అన్ని వసతులను సిద్ధం చేశామన్నారు. అదే విధంగా గిరివలయం వెళ్లే భక్తులు కర్పూర వెలిగించేందుకు, శివునిగా భావించే కొండను ఎక్కేందుకు నిషేధం విధించామని ఇందుకోసం మొత్తం 14 చోట్ల పోలీస్ నిఘా టవర్‌లు ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు, మున్సిపాలిటీ, పంచాయతీ నిర్వాకం, రోడ్డు భద్రతా శాఖ తదితర శాఖలు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థఽం చైన్నై, బెంగుళూరు, కాంచిపురం, వేలూరు, గుడియాత్తం, పేర్పంబట్టు, విల్లుపురం, రాణిపేట వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులతో పాటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు రైళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు రాజగోపురం మార్గంలో తిరుమంజన గోపురంలోనికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలు, మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పందిళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.