తమిళసినిమా: సినిమాల కోసం శ్రమించే చియాన్ విక్రమ్ ఆ శ్రమ అంతా అభిమానుల సంతోషం కోసమే అంటున్నారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం వీర ధీర శూరన్ 2. హెచ్‌ఆర్ పిక్చర్స్ పతాకంపై రియాశిబు నిర్మించిన ఈ చిత్రానికి చిత్రా చిత్ర ఫేమ్ ఎస్‌యూ.అరుణ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటి దుషారావిజయన్ నాయకిగా నటించిన ఇందులో ఎస్‌జే.సూర్య, సురాజ్ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. తేనీఈశ్వర్ చాయాగ్రహణం, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నె, ఆవడిలోని వేల్స్‌టెక్ యూనివర్సిటీ ఆవరణలో వేలాది మంది విద్యార్థులు, సినీ ప్రముఖుల మధ్య ఆడియో, ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇది హాలీవుడ్ స్థాయిలో తమిళగడ్డపై తెరకెక్కించిన తమిళ చిత్రం అని అన్నారు. తమిళసినిమా గౌరవం అని ఎస్‌జే.సూర్య పేర్కొన్నారు. దర్శకుడు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ నిర్మాతలు శిబు, రియా శిబులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తాను, విక్రమ్ నటించిన దూళ్ చిత్రాన్ని మదురైలోని చింతామణి థియేటర్‌లో చూశానని, ఇప్పుడు ఆయన నటించిన చిత్రానికి దర్శకత్వం వహించడం విక్రమ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. వీర ధీర శూరన్ తన జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రం అని దుషారావిజయన్ పేర్కొన్నారు. విక్రమ్ మాట్లాడుతూ అభిమానులు విక్రమ్ వేరే కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారని, అరుణ్‌కుమార్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే నటించడానికి ఓకే చెప్పానన్నారు. తమ ఇద్దరి భావజాలం ఒకేలా ఉండడంతో వీర ధీర శూరన్ ప్రేక్షకులకు రగడ చిత్రంగా ఉంటుందన్నారు. ఈచిత్రం తన అభిమానుల కోసం అని, వారే తన ప్రియమైన అభిమానులు అని విక్రమ్ పేర్కొన్నారు.