– కోవైలో కలకలం
సేలం : ఎన్ని పాలు పోసి పెంచినా చివరికి పాము కాటు వేస్తుందనే చందంగా పాములను పట్టి సురక్షితంగా అడవి ప్రాంతాలలో వదిలే వీరుడు పాము కాటుకు గురైన ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన కోవైలో కలకలం రేపింది. కోయంబత్తూరు జిల్లా మరుదమలై సమీపంలో ఉన్న వడవల్లి ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ (39). ఇతని నివాస ప్రాంతాలలోకి చొరబటే పాములను పట్టి సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టే పని చేస్తూ వచ్చారు. 20 ఏళ్లకు పైగా పలు ప్రాంతాలు, ఇళ్లలో చొరబడిన విషపూరిత నాగుపాముతో సహా అనేక రకాల పాములను సంతోష్ పట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈనేపథ్యం గత 17వ తేదీ ఉదయం కోవై తొండాముత్తూర్ నాల్‌రోడ్డు ప్రాంతంలో ఉన్న ఒక నివాస ప్రాంతంలో నాగుపాము ఉన్నట్టు సమాచారం అందడంతో సంతోష్ అక్కడికి వెళ్లారు. నాగుపామును పడుతుండగా అకస్మాత్తుగా అది సంతోష్‌ను కాటువేసింది. స్పృహ తప్పి పడిపోయిన సంతోష్‌ను స్థానికులు కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి వైద్యులు తీవ్ర చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ స్థితిలో బుధవారం చికిత్స ఫలించగా సంతోష్ మృతి చెందాడు. కాగా సంతోష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా నివాస ప్రాంతాలలోకి చొరబడే పాము కాటు బారిన పడకుండా అటు ప్రజలను, ప్రజల బారి నుంచి పాములను కాపాడుతూ వచ్చిన సంతోష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.