అన్నానగర్: భారతదేశంలో మొదటి హైడ్రోజన్ రైలు ఉత్పత్తి 80 శాతం పూర్తయింది. వచ్చే నెలలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రపంచ దేశాలతో సమానంగా రైల్వే రంగాన్ని మెరుగుపరిచేందుకు సెంట్రల్ రైల్వే బోర్డు హైడ్రోజన్ రైలును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక వేసింది. దీని ప్రకారం గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని నిర్ణయించి రూ.2,300 కోట్లు కేటాయించారు. చైన్నె పెరంబూరులోని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో హైడ్రోజన్ రైలు కోచ్‌ల ఉత్పత్తి గత సంవత్సరం ప్రారంభమైంది. ప్రస్తుతం హైడ్రోజన్ రైలు ఉత్పత్తి చివరి దశకు చేరుకుంది. పెయింటింగ్, హైడ్రోజన్ సిలిండర్ల అనుసంధానం, సాంకేతిక పనులు జరుగుతున్నాయి. ఈ పనులు త్వరలో పూర్తవుతాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి వచ్చే నెలలో ట్రయల్ రన్‌కు పంపనున్నారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యాణాలోని జింద్–సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల దూరం నడవనుంది. ఈ మార్గంలోనే వచ్చే నెలలో ట్రయల్‌రన్ కూడా జరగనుంది. రైలులో 1,200 మంది ప్రయాణించేలా శక్తివంతమైన ఇంజిన్‌తో అమర్చారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఈ రైలును రూపొందించారు. ఏప్రిల్ చివరి నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు మాట్లాడుతూ పెరంబూర్‌లో తయారు చేస్తున్న హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన రైలు అన్నారు. ఇతర దేశాల్లో గరిష్టంగా 5 కోచ్‌లు మాత్రమే ఉంటాయి. అయితే, తొలిసారిగా 10 కోచ్‌ల హైడ్రోజన్ రైలు సర్వీసును భారతదేశంలో నడపబోతున్నారు. ప్రపంచ దేశాలకు ఇదో ఉదాహరణ అన్నారు. ఒక్కో రైలును రూ.80 కోట్లతో తయారు చేయనున్నట్లు తెలిపారు. కార్ల ఎగ్జాస్ట్ ఉద్గారాల కాలుష్యాన్ని నివారించడానికి పర్వత ప్రాంతాల్లో హైడ్రోజన్ రైలును నడపాలని యోచిస్తున్నట్లు తెలిపారు.