● ఐఐటీ మద్రాస్‌లో రూపకల్పన ● ప్రారంభించిన ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ | - | Sakshi
Sakshi News home page

● ఐఐటీ మద్రాస్‌లో రూపకల్పన ● ప్రారంభించిన ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌

Mar 18 2025 12:43 AM | Updated on Mar 18 2025 12:42 AM

సాక్షి, చైన్నె: అధునాతన రీతిలో ఐఐటీ మద్రాసులో తదుపరి తరం అంతరిక్ష నౌక, ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాలకు అవసరమైన ఉష్ణ బదిలీ, శీతలీకరణ వ్యవస్థలు, ద్రవ డైనమిక్స్‌పై పరిశోధనలకు నోడల్‌ కేంద్రం ఏర్పాటైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ ఈ కొత్త పరిశోధన కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ చొరవకు మద్దతు ఇచ్చే విధంగా ఎస్‌. రామకృష్ణన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెనన్స్‌ ఇన్‌ ఫ్లూయిడ్‌ అండ్‌ థర్మల్‌ సైనన్స్‌ రీసెర్చ్‌ పేరిట ఈ కేంద్రం రూపుదిద్దుకుందని అధికారులు ప్రకటించారు. అధునాతన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాలలో స్వావలంబనను ప్రోత్సహించడం, ప్రపంచ ప్రతిభ , పరిశోధన నిధులను ఆకర్షించడం, అంతరిక్ష అనువర్తనాల కోసం థర్మల్‌ సైన్సెస్‌ పరిశోధనలో ఈ కేంద్రం అగ్రగామిగా నిలిచే విధంగా చర్యలు తీసుకున్నారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఉన్న ఈ అత్యాధునిక పరిశోధనా కేంద్రం, అంతరిక్ష నౌక, ప్రయోగ వాహన ఉష్ణ నిర్వహణలో కీలకమైన పురోగతిపై దృష్టి పెడుతుంది. ఇది భారతదేశం లో విస్తరిస్తున్న అంతరిక్ష ఆశయాలకు కీలకమైన రంగంగా మారనున్నది. ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెనన్స్‌ (సీఓఈ)లో పరిశోధన చంద్ర, అంగారక, డీప్‌–స్పేస్‌ మిషన్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేయనుంది. భారతదేశం అంతరిక్ష సాంకేతికతలో ముందంజలోకి తీసుకెళ్లనుంది. ఈ ల్యాబ్‌ను ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ ప్రారంభించారు. అనంతరం ఆర్కాట్‌ రామచంద్రన్‌ సెమినార్‌ హాల్‌’ను ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి, ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సమక్షంలో ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత హీట్‌ ట్రానన్స్‌ఫర్‌ ప్రొఫెసర్‌ అయిన ప్రొఫెసర్‌ ఆర్కాట్‌ రామచంద్రన్‌ (1923 – 2018) 1967 – 1973 మధ్య ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఐఐటీ మద్రాస్‌లో హీట్‌ ట్రానన్స్‌ఫర్‌, థర్మల్‌ పవర్‌ ల్యాబ్‌ను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి, ఇస్రో ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌. సోమనాథ్‌, డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, ఐఐటీ మద్రాస్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం సెంటర్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ అరవింద్‌ పట్టమట్ట, ఐఐటీ మద్రాస్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ పి. చంద్రమౌళి, ఐఐటీ మద్రాస్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రాక్టీస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పివి వెంకటకృష్ణన్‌, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

పూర్తి మద్దతు..

కేంద్రం పనితీరు ఇలా..

అంతరిక్ష నౌక, వాహక నౌకల ఉష్ణ నిర్వహణ– ఉపగ్రహాలు, వాహక నౌకలలో ఉష్ణ వెదజల్లే సవాళ్లను పరిష్కరించడం. శీతలీకరణ వ్యవస్థలపై ప్రయోగాత్మక అధ్యయనాలు – మైక్రో హీట్‌ పైపులు, స్ప్రే కూలింగ్‌, ఆవిరి గదులు, రెండు దశల ఉష్ణ బదిలీ పరికరాలను ఉపయోగించి సమర్థవంతమైన శీతలీకరణ పరిష్కారాలను అభివృద్ది చేయడం లక్ష్యం ఈ కేంద్రం పనిచేయనుంది. హై–ఫిడిలిటీ సిమ్యులేషన్‌ – టెస్టింగ్‌ సౌకర్యాలు – వాస్తవ ప్రపంచ ధ్రువీకరణ కోసం అత్యాధునిక కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ సిమ్యులేషనన్‌లు, ప్రయోగాత్మక సెటప్‌లను ఉపయోగించడంతో పాటూ సామర్థ్య నిర్మాణం – శిక్షణ, పరిశ్రమ–విద్యా రంగాల సహకారాన్ని పెంపొందించుకుంటూ, ఐఐటీ మద్రాస్‌లో అధునాతన డిగ్రీలను అభ్యసించడానికి, ఇస్రో శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం. ఈ కొత్త పరిశోధన కేంద్రం నుంచి ఫలితాలను ఆశిస్తున్నామని ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్‌ అరవింద్‌ పట్టమట్ట వివరించారు.

అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించేలా

పరిశోధన కేంద్రం

ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ మాట్లాడుతూ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం మన వద్ద మూడు వేర్వేరు ఇంజిన్లు ఉన్నాయన్నారు. మూడవది మానవ–రేటింగ్‌ పొందిందన్నారు. ప్రపంచంలోని ఆరు దేశాలలో మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని, ఈ టెక్నాలజీలో తాము మూడు ప్రపంచ రికార్డులు సృిష్టించా మన్నారు. ఈ ప్రయత్నం గురించి వివరిస్తూ, ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రొఫెసర్‌ వి. కామకోటి నాయకత్వంలో ఈ సంస్థ గొప్ప పని చేస్తోందన్నారు. ఇది రెండు నోబెల్‌ బహుమతులను లక్ష్యంగా ముందుకు సాగాలని, ఈ ప్రయత్నాలన్నింటిలోనూ పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ఎస్‌ రామకృష్ణన్‌తో తనకున్న అనుబంధాన్ని ఈసందర్భంగా నారాయణన్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక సాంకేతిక నిపుణుడు మాత్రమే కాదని, గొప్ప మేనేజర్‌ కూడా అని కొనియాడారు. ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి మాట్లాడుతూ, ‘అంతరిక్షాన్ని మరింతగా అన్వేషిస్తున్నామని పేర్కొంటూ థర్మల్‌ , శీతలీకరణ అవసరాలను నిర్వహించగల సాంకేతికతల అవసరం పెరుగుతోందన్నారు. ప్రతిపాదిత కేంద్రం ఇస్రోతో సంయుక్తంగా చాలా ప్రభావవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేస్తుందన్నారు.ఈ సందర్భంగా డాక్టర్‌ ఎస్‌. సోమనాథ్‌, ఇస్రో ప్రొఫెసర్‌ డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, ఐఐటీ మద్రాస్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ పి. చంద్రమౌళి, ఐఐటీ మద్రాస్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రాక్టీస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పివి వెంకటకృష్ణన్‌లు కూడా ప్రసంగించారు.

● ఐఐటీ మద్రాస్‌లో రూపకల్పన ● ప్రారంభించిన ఇస్రో చైర్మన్1
1/1

● ఐఐటీ మద్రాస్‌లో రూపకల్పన ● ప్రారంభించిన ఇస్రో చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement