సమన్వయానికి.. కసరత్తు! | - | Sakshi
Sakshi News home page

సమన్వయానికి.. కసరత్తు!

Mar 12 2025 8:23 AM | Updated on Mar 12 2025 8:19 AM

● శశికళ, టీటీవీ, వైద్యలింగం భేటీ

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే వర్గాలను సమన్వయ పరిచే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌, మాజీ సీఎం పన్నీరు శిబిరంలో కీలక నేతగా ఉన్న వైద్యలింగంలు భేటీ అయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణిస్వామి పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2026 ఎన్నికల ద్వారా అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. అలాగే, పార్టీ బలోపేతం దిశగా కసరత్తుల వేగాన్ని పళణిస్వామి పెంచారు. రాష్ట్రంలోని యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ పరిస్థితులలో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ దివంగత సీఎం జయలలిత నెచ్చెలి , చిన్నమ్మ శశికళ , అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం నేత దినకరన్‌, మాజీ సీఎం పన్నీరు సెల్వం మళ్లీ అందర్నీ ఏకం చేస్తాం.... సమష్టి సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొంటామన్న నినాదంతో గత కొంత కాలంగా ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో అందర్నీ సమన్వయ పరిచే కసరత్తులు వేగవంతం చేసే విధంగా వ్యూహాలకు వీరు పదును పెట్టినట్టున్నారు. ఇందులో భాగంగా తంజావూరులోని ఒరత్తనాడు వేదికగా ఓ సమావేశం జరిగి ఉండటం మంగళవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఒరత్తనాడులోని వైద్యలింగం నివాసంకు తొలుత దినకరన్‌, ఆతర్వాత శశికళ రావడం గమనార్హం. వైద్యలింగంకు పరామర్శ అని భావించినా, దీని వెనుక అన్నాడీఎంకే రాజకీయ చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా అన్నాడీఎంకేలో అందర్నీ సమన్వయ పరిచి, సమష్టి వేదికపైకి తీసుకొచ్చే వ్యూహాన్ని రచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు త్వరలో మాజీ సీఎం పన్నీరు సెల్వం, శశికళ, దినకరన్‌లు ఒకే వేదిక మీద కనిపించ బోతున్నారు. ఆ తదుపరి అన్నాడీఎంకేలోని కేడర్‌, నేతలను ఏకం చేసే విధంగా వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ భేటీ గురించి దినకరన్‌ పేర్కొంటూ, వైద్యలింగం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చారని, ఆయన్ని పరామర్శించినట్టు పేర్కొన్నారు. రాజకీయాలు కూడా మాట్లాడుకున్నామని పేర్కొన్నారు. అలాగే చిన్నమ్మ శశికళను ప్రశ్నించగా దివంగత నేతలు ఎంజీఆర్‌, జయలలిత మార్గంలో అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావాలని, అప్పుడే పార్టీకి బలం , అధికారం తథ్యం అన్నది గుర్తించాలని సూచించారు. 2026 ఎన్నికలలో అందరూ ఒకే వేదిక మీదకు వస్తారన్న నమ్మకం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement