
చైన్నె విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం 5.5 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చైన్నె విభాగం అధికారులు సీజ్ చేశారు.
సాక్షి, చైన్నె : చైన్నె విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం 5.5 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చైన్నె విభాగం అధికారులు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ముగ్గురితో పాటుగా సహకరించి విమానాశ్రయం కాంట్రాక్టు సిబ్బందిని అరెస్టు చేశారు. వివరాలు.. శ్రీలంక నుంచి చైన్నెకు బంగారం పెద్దఎత్తున తరలుతున్నట్టుగా వచ్చిన ముందస్తు సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలంక నుంచి సాయంత్రం వచ్చిన ఓ విమానంలో సోదాలు చేశారు. వారికి ఎలాంటి బంగారం చిక్కలేదు.
దీంతో ఆ విమానంలో ప్రయాణించిన వారిని సోదాలు చేపట్టి.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు తమ వెంట తెచ్చిన బంగారాన్ని కాంట్రాక్టు సిబ్బంది ద్వారా వెలుపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. దీంతో పథకం ప్రకారం ఆ కాంట్రాక్టు సిబ్బందితో పాటు, ఆ బంగారం స్వా ధీనం చేసుకునేందుకు వచ్చిన చైన్నెకు చెందిన రిబాయుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి సహకరించిన కాంట్రాక్టు సిబ్బంది రాజ్‌కుమార్‌ను, బంగారాన్ని శ్రీలంక నుంచి తరలించిన మహ్మద్ బషీర్, మహ్మద్ అక్రవ్‌ును కూడా అరెస్టు చేశారు. రిబాయుద్దీన్ గతంలో కూడా బంగారం అక్రమ రవాణా చేస్తూ అరెస్టయినట్లు విచారణలో తేలింది. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న 5.5 కేజీల బంగారం విలువ రూ. 3.3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.