పింక్‌ బస్సులో క్యాన్సర్‌ పరీక్షలు

తిరుపతి కల్చరల్‌ : జిల్లాలో పింక్‌ బస్సుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ముందుగా వీపీఆర్‌ ఫౌండేషన్‌ కింద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు వితరణగా అందించిన రూ.2.75 కోట్ల విలువైన పింక్‌ బస్‌ను పరిశీలించారు. ఈఓ మాట్లాడుతూ 40 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ఎడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మరో పింక్‌ బస్సును కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్విమ్స్‌లోని పలు విభాగాలను సందర్శించారు. శ్రీబాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద స్విమ్స్‌లో క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసుకున్న పేషెంట్స్‌ను పరామర్శించారు. స్విమ్స్‌ సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌వీ కుమార్‌ మాట్లాడుతూ పేషెంట్స్‌ సౌకర్యార్థం ఈవెనింగ్‌ పే క్లినిక్స్‌ ప్రారంభించామని, ఇదే విధంగా కార్డియాక్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ సదాభార్గవి, స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌ఎం ఓ.కోటిరెడ్డి, శ్రీబయో స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జయచంద్రారెడ్డి, ఎస్‌పీఎంసీడబ్ల్యూ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఉషాకళావత్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ నాగరాజు, టీటీడీ చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వర్‌, ఎఫ్‌ఏఎన్‌సీఏఓ బాలాజీ, టీటీడీ చీఫ్‌ పీఆర్‌ఓ రవి పాల్గొన్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top