
చెల్లప్పన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం స్టాలిన్
● ఇకపై అధికారిక లాంఛనాలతో దాతలకు అంత్యక్రియలు ● సీఎం స్టాలిన్ ఆదేశాలు ● అవయవదానంలో తమిళనాడు తొలిస్థానంలో ఉందని వెల్లడి
సాక్షి, చైన్నె: బ్రెయిన్ డెడ్‌కు గురైన తర్వాత అవయవదానం చేసిన వారి భౌతికకాయాలకు రాష్ట్రంలో ఇకపై అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శనివారం ఇందుకు సంబంధించిన ఆదేశాలను సీఎం ఎంకే స్టాలిన్ జారీ చేశారు. వివరాలు.. అవయవదానంపై ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రమాదం బారిన పడ్డ తమ వారి అవయవాల్ని మరొకరికి దానం చేయడానికి అనేక కుటుంబాలు ముందుకు వస్తున్నాయి. ఒకరి అవయవాల రూపంలో ఎందరో రోగులకు పునర్జన్మను కల్పించే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల వేగం పుంజుకున్నాయి. అదే సమయంలో అవయవదానంతో మరొకరి జీవితాల్లో వెలుగు నింపేందుకు కారణమైన బ్రెయిన్ డెడ్ మృతులకు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ వైద్యులు ఆస్పత్రి ఆవరణలో నివాళులర్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అవయవ దానానికి మరిన్ని కుటుంబాలు ముందుకు వచ్చే విధంగా, బ్రెయిన్ డెడ్ మృతులకు ఇకపై అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలతో సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను శనివారం సీఎం ప్రకటించారు. అవయవదానం ద్వారా వందల మంది రోగుల సంరక్షణలో దేశంలోనే తమిళనాడు అగ్రగామిగా నిలుస్తున్నట్లు వివరించారు. బ్రెయిన్ డెడ్‌కు గురైన తమ వాళ్ల అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తున్న కుటుంబాల నిస్వార్థ త్యాగాలకు వెలకట్ట లేమన్నారు. అవయ దాతల త్యాగాన్ని గౌరవించే విధంగా ఇక, వారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. ‘‘అవయవదానం చేయండి. మరెందర్నో ప్రాణాలతో రక్షించండి’’ అని పిలుపు నిస్తూ, బ్రెయిన్ డెడ్‌తో మరణం అంచున ఉన్న వారి అవయవాలను దానం చేయడానికి కుటుంబాలు మరింతగా ముందుకు రావాలని సీఎం పిలుపు నిచ్చారు.
సిలంపోలి చెల్లప్పన్ విగ్రహం ఆవిష్కరణ
నామక్కల్‌లోని సిలంపోలి చెల్లప్పన్ సిలప్పతికార ట్రస్ట్ తరపున సీనియర్ తమిళ పండితుడు సిలంబోలి చెల్లప్పన్‌కు విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిని సీఎం స్టాలిన్ చైన్నె నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. సేంతమంగళం రోడ్, కొండంపాటిమేడు సిలంపోలియార్ నగర్‌లో ఈ విగ్రహాన్ని, శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సిలంపోలి చెల్లప్పన్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన సేవలను గుర్తు చేస్తూ సీఎం స్టాలిన్ ప్రసంగించారు.
విద్యుత్ చార్జీల తగ్గింపునకు చర్యలు
తమిళనాడులోని చిన్న, సూక్ష్మ , మధ్యతరహా పరిశ్రమలు, మిల్లులు పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఈనెల 25వ తేదీ ఒక రోజు సమ్మెకు పిలుపు నివ్వడంతో సీఎం స్టాలిన్ స్పందించారు. వారి అభ్యర్థన మేరకు చార్జీల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పరిశ్రమలకు ప్రాథమికంగా కల్పించిన ప్రయోజనాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా 15 శాతం మూలధన సబ్సిడీని అందజేస్తామని ప్రకటించారు. 12 కిలోవాట్ల కంటే తక్కువ చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఊరట కల్గించే విధంగా సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా వాయిస్ ఆఫ్ ఇండియా నినాదంతో సీఎం స్టాలిన్ ఆడియో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం రెండో భాగం ఆడియోను విడుదల చేశారు. ఇందులో కేంద్రంలోని బీజేపీ పాలకులను అవినీతి ఎండగట్టారు. కాగ్ నివేదిక ఆధారంగా వివిధ పథాకాల్లో జరిగిన అవినీతిని గుర్తు చేశారు. దేశాన్ని రక్షించుకోవాలంటే 2024 ఎన్నికలలో బీజేపీని గద్దెదించాల్సిందేనని ప్రజలకు పిలుపు నిచ్చారు.