తమిళసినిమా: సంగీత జ్ఞాని ఇళయరాజా 80వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నటుడు కిక్ శ్యామ్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంతకుముందు విజయకాంత్ హీరోగా కన్నుపట్ట పోగదయ్యా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన భారతీ గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 5ఈ క్రియేషన్స్ పతాకంపై సుజన్ శ్యామువేల్ రాయ్, హరీష్ ముత్తాల్ శెట్టి, సమీర్ అమర్థిన్ కలిసి నిర్మిస్తున్నారు. నటుడు రాధారవి, సంతానభారతి, తిరుకుమరన్, అజయ్ ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని, ఎంఎస్ ప్రభు చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బాలల నేపథ్యంలో సాగే మంచి సందేశంతో కూడిన జనరంజక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పిల్లల జీవన విధానం, వారి భావనలు అంటూ చైన్నెలో జరిగే సంఘటనల ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదన్నారు. కార్యక్రమానికి ఇళయరాజా వచ్చి చిత్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.