
మదురై ధర్మాసనం
● న్యాయ అధికారులకు కోర్టు హెచ్చరిక ● సోమరితనం కేరాఫ్‌గా న్యాయశాఖ
సాక్షి, చైన్నె: కోర్టు ఉత్తర్వులను అమలుచేయడంలో నిర్లక్ష్యం వద్దని కేంద్ర న్యాయశాఖ అధికారులను మదురై ధర్మాసనం హెచ్చరించింది. సోమరితనానికి కేరాఫ్ అడ్రస్సుగా కేంద్ర న్యాయశాఖ మారినట్టుందని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు.
కోర్టు ఉత్తర్వులను అమలు పరచడంలో
నిర్లక్ష్యం..
రామనాథపురానికి చెందిన న్యాయవాది తిరుమురుగన్ ఇటీవల మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ వేశాడు. అటవీ సంరక్షణ పేరిట కేంద్ర అటవీశాఖ ఓ ముసాయిదాను ప్రవేశ పెట్టినట్టు గుర్తు చేశారు. అయితే, ఈ ముసాయిదా గురించి ఆంగ్లం, హిందీలో మాత్రమే అభిప్రాయాలు తెలియజేయాలని సూచించినట్టు గుర్తు చేశారు. అయితే, ఆంగ్లం, హిందీ తెలియని వారి పరిస్థితి ఏమిటో అని ప్రశ్నించారు. ఈ దృష్ట్యా, ఈ అభిప్రాయ సేకరణకు స్టే విధించాలని, అన్ని భాషల్లో అభిప్రాయాలను తెలియజేయడానికి వీలు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో అభిప్రాయ సేకరణకు కోర్టు స్టే విధించింది. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు అన్ని భాషల్లో అవకాశాలు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని ఇంతవరకు కేంద్ర న్యాయశాఖ వర్గాలు అమలు చేయలేదు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు ఆర్ సుబ్రమణియన్, విక్టోరి గౌరి బెంచ్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేషన్ హాజరై వాదనలు వినిపించారు. పార్లమెంట్‌లో తీసుకునే నిర్ణయాలలో కోర్టులో జోక్యం తగదని పేర్కొన్నారు. అనంతరం తక్షణం స్టే తొలగించిన పక్షంలో, పిటిషనర్ విజ్ఞప్తి మేరకు అన్ని భాషల్లో అభిప్రాయ సేకరణ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు బెంచ్ ఆక్షేపణ వ్యక్తం చేస్తూ కేంద్ర న్యాయ శాఖ పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో కోర్టులో ఎన్నో ఉత్తర్వులు జారీ చేశాయని, వాటన్నింటిని అమలు చేశారా అని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు. మదురై న్యాయవ్యవస్థలో ఖాళీల గురించి అనేక సార్లు ఆదేశాలు ఇచ్చామని ఇవన్నీ అమలు చేశారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణం కేంద్రం ఉత్తర్వులు ఇవ్వొచ్చుగా అని పేర్కొంటూ, ఉత్తర్వులను అమలుచేయడంలో న్యాయ శాఖ విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. సోమరితనానికి, నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్సుగా ఈ శాఖమారిందని విమర్శించారు. స్టే తొలగింపునకు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు.